విజయవాడ యనమల కుదురుపాత పంచాయతీకి చెందిన షేక్ సాజిద్ 'మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ'తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. కళ్లకు గంతలు కట్టుకొని కరెన్సీ నోట్లు, రంగులు, ఎదురుగా వచ్చిన వారి పేర్లు చెప్పేస్తాడు. సాజిద్‌కు గత కొన్ని రోజులుగా మిడ్ బ్రెయిన్ యాక్టివిటీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణకు వెళ్లిన మూడు రోజుల్లోనే వాసన చూసి, స్పర్శతో అన్ని వస్తువులు గుర్తిస్తున్నాడు. కళ్లకు గంతలు కట్టుకొని సైక్లింగ్, స్కేటింగ్ చేసేస్తాడు. బాలుడి ప్రతిభ చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తూ... అందరి మన్ననలు పొందుతున్నాడు.
సాజిద్ ముందు తెలిసిన వారు ఎవరైనా నిలబడితే వారి పేర్లు చెబుతాడు, పేర్లు తెలియక పోతే వారు ధరించిన వస్త్రాల రంగులు చెబుతాడు. ఎదురుగా ఉన్న వారికి కళ్లజోడు ఉందా లేదా, చేతులకు ఎన్ని గాజులు ఉన్నాయి, చేతి వేళ్లకు ఎన్ని ఉంగరాలు ఉన్నాయో చెప్పేస్తున్నాడు. పేపరు మీద రాసిన అక్షరాలు తడిమి చదువుతాడు.