ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ నగరవాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..ఎలా అంటే? - విజయవాడ తాజా వార్తలు

విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. కీలకమైన బెంజిసర్కిల్‌ రెండో పైవంతెన రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన ఈ వంతెనను గుత్తేదారు 6 నెలలు ముందుగానే పూర్తిచేయడం విశేషం. ఇప్పటికే ప్రయోగాత్మక పరిశీలన, సామర్థ్య పరీక్షలతో పాటు భారీ వాహనాలు సైతం ఈ వంతెనపై వెళ్లేలా ట్రైల్ రన్ పూర్తైంది.

విజయవాడ నగరవాసుల తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
విజయవాడ నగరవాసుల తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

By

Published : Nov 4, 2021, 9:45 AM IST

విజయవాడ నగరవాసులకు దీపావళి కానుకగా బెంజిసర్కిల్‌ రెండో పైవంతెన ఆరునెలలు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. రేపటి నుంచి రెండో పైవంతెన మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతించనున్నారు. నగరంలోనే ఎంతో కీలకమైన ఈ మార్గంలో పైవంతెన అందుబాటులోకి రానుండటంతో...వాహనదారుల కష్టాలు సగం మేర తగ్గినట్లే. ముఖ్యంగా జాతీయరహదారిపై ప్రయాణించే భారీ వాహనదారులు.. నగరం దాటి వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. కీలకమైన ఆస్పత్రులు, విద్యాసంస్థలతోపాటు ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, ఉత్తరాంధ్రకు వెళ్లే కీలక మార్గం కావడంతో నిత్యం వేలకొద్ది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. బెంజిసర్కిల్‌ సిగ్నల్‌తో చాలా సమయం వాహనాలు వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటాయి.

నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు బెంజిసర్కిల్‌ పైవంతెన నిర్మాణాన్ని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చేపట్టింది. ఇప్పటికే ఒకవైపు వంతెన అందుబాటులోకి రాగా..మరోవైపు వంతెన మీదుగా రేపటి నుంచి వాహనాలను అనుమతించనున్నారు.

ఒప్పందం ప్రకారం ఈ వంతెన 18 నెలల్లో నిర్మించాల్సి ఉండగా.. 12 నెలల్లోనే గుత్తేదారు సంస్థ పూర్తిచేసింది. శబ్దకాలుష్య రహితంగా ఈ వంతెన నిర్మించడం విశేషం. వంతెన రక్షణగోడలో శబ్ద నిరోధకాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా వెళ్లిపోవడంతో.. ఎంజీ రోడ్డు-బందరు రోడ్డుపై ట్రాఫిక్‌కు ఉపశమనం లభిస్తుంది. నిర్మల కాన్వెంట్‌- పిన్నమనేని పాలిక్లినిక్‌ రహదారి మార్గంలోనూ ట్రాఫిక్ తగ్గిపోనుంది. గురునానక్‌ రోడ్డు- రమేష్‌ ఆసుపత్రి కూడలిలోనూ వాహనదారులు స్వేచ్ఛగా వెళ్లనున్నారు. మొదటి వంతెనలో లోపాలను సరిచేసుకుంటూ రెండో వంతెన నిర్మాణం చేపట్టారు. రెండు వంతెనల్లో ఇరువైపులా మూడు వరుసల రహదారి నిర్మాణం చేపట్టడంతోపాటు మొత్తం ఆరు వరుసల పైవంతెన అందుబాటులోకి వచ్చింది.

విజయవాడ నగరవాసుల తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details