రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల వ్యవధిలో 15 ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తే..9 చోట్ల అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కే.వీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. "పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని చైత్ర ఆసుపత్రి, అనంతపురంలోని ఆశ, విశాఖలోని గోపాలపట్నం ఎస్ఆర్, అనిల్ నీరుకొండ, రమ్య ఆసుపత్రులు, విజయవాడలోని శ్రీరామ్, గుంటూరులోని విశ్వాస్, చిత్తూరు జిల్లా పీలేరులోని డాక్టర్ ప్రసాద్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశాం" అని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
ఇప్పటివరకూ మొత్తంగా 37 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కొవిడ్ చికిత్సకు నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ మొత్తం వసూలు చేయటం, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు దుర్వినియోగం.. ప్రభుత్వం అనుమతి లేకుండా కరోనా చికిత్స నిర్వహించటం వంటి అంశాల్లో కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన రోగులకు కరోనా చికిత్స తిరస్కరించిన ఆసుపత్రులపైనా కేసులు పెట్టామన్నారు.