కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అబ్బాస్ వలీ.. 11 ఏళ్లుగా విజయవాడలోని విద్యాధరపురం డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగం సాధించినా, ఇంకా ఏదో సాధించాలన్న తపనతో ఆర్టీసీకి సంబంధించిన అనేక బొమ్మలు గీసేవారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో తనకు, తాను పనిచేస్తున్న సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. విధులు నిర్వహిస్తూనే.. 15రోజులు శ్రమించి పోస్ట్ కార్డుపై 7,600 సార్లు ఏపీఎస్ఆర్టీసీ పేరును రాశారు. దీనిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు. ఆయన రాసిన ఏపీఎస్ఆర్టీసీ పదాలను లెక్కించి ఆవార్డు ప్రదానం చేశారు.
కండక్టర్ అబ్బాస్ వలీ ఈ ఘనత సాధించటంపై డిపో మేనేజర్‌తోపాటు సహోద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు రావటం సంతోషంగా ఉందని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు తమ నాన్న ఆదర్శంగా నిలిచారని అబ్బాస్ కుమార్తె, కుమారుడు తెలిపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్ మాత్రమే కాకుండా సంస్థకు మరింత పేరు తీసుకువచ్చేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధన చేస్తానని అబ్బాస్ వలీ స్పష్టం చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ నాకు జీవితాన్నిచ్చింది. నా కుటుంబం సంతోషంగా ఉందంటే దానికి కారణం ఏపీఎస్ఆర్టీసీనే. అందరిలా కాకుండా నేను పని చేస్తున్న సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతోనే పోస్టుకార్డుపై సంస్థ పేరును రాశాను. సమైక్య ఆంధ్ర ఉద్యమంలోనూ నేనూ పాల్గొన్నాను. ఆర్టీసీకి మరింత పేరును తీసుకువచ్చేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు కూడా సాధన చేస్తాను.