'దేశభాషలందు తెలుగు లెస్స' అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. తెలుగులోని మాధుర్యం, గొప్పదనం మరే భాషలోనూ లేదని ఎందరో ప్రపంచ ప్రఖ్యాత కవులు, సాహితీవేత్తలు చెప్పారు. అలాంటి గొప్ప భాషను మాతృభాషగా చెప్పుకోవడమే ఎంతో గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా..హైదరాబాద్ ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాతృభాష కళ్ల వంటిదైతే పరభాష కళ్లజోడు వంటినదన్న వెంకయ్యనాయుడు.. తెలుగును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. అమ్మభాష గొప్పదనం ఇంటినుంచే పిల్లలకు తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు.
'మాతృభాష.. ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో నేర్చుకునే భాష'
మాతృభాష.. ప్రతి బిడ్డ 'అమ్మ ఒడి'లో నేర్చుకునే భాష. అప్రయత్నంగానే ప్రతి మనిషి అణువణువులో జీర్ణించుకుపోయేది. కాలానుగుణంగా పరభాషా మోజులో అనేక మంది అమ్మభాషని మర్చిపోతున్నారు. అందుకే యునెస్కో ఏటా ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా...పలువురు వక్తలు మాతృభాషా మాధుర్యాన్ని, పరిరక్షించాల్సిన అవశ్యకతను వివరించారు.
స్వర్ణభారత్ మాతృభాష దినోత్సవ కార్యక్రమంలో రచయితలు సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సహా ప్రముఖులు పాల్గొన్నారు. ఏ ప్రాంతంవారైనా సరే.. మాతృభాష మనుగడను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని అభిప్రాయపడ్డారు. కవితలతో తెలుగుభాషలోని గొప్పదనాన్ని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ.. ట్రస్ట్ సేవలను కొనియాడారు. మాతృభాష పరిరక్షణ ఏ ఒక్కరోజుకో పరిమితం కాదని.. ప్రతిరోజూ మాతృభాషా దినోత్సవమేనని మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం అంతా కలిసి కృషి చేస్తేనే మాతృభాషను పరిరక్షించుకోగలమని కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు.