ప్రజాప్రతినిధుల పనితీరు, దీర్ఘకాలిక ప్రజాప్రయోజనాలే కొలమానంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణం, సామర్థ్యం, యోగ్యత ఆధారంగానే ఎన్నుకోవాలని సూచించారు. కులం, వర్గం, నేరతత్వం, డబ్బు ఆధారంగా ఎన్నుకోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి రచించిన ‘ఎకో టి కాలింగ్’... తెలుగు అనువాదం 'సుపరిపాలన' పుస్తకాన్ని హైదరాబాద్‌లో తన నివాసంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
కొత్తగా సివిల్ సర్వీసుల్లోకి వచ్చే యువ ఐఏఎస్‌లకు ఈ పుస్తకం కరదీపికలా పని చేస్తుందని, పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిళ్లు, అడ్డంకులు వంటి ఎన్నో అంశాలు పుస్తకంలో ఉన్ననట్లు తెలిపారు. వార్షిక బడ్జెట్ మొదలుకుని ఆత్మనిర్భర్ భారత్, మిషన్ కర్మయోగి, వ్యవసాయం, రహదారి భద్రత, భూసేకరణలో మానవతా కోణం, సాంకేతిక విద్య, పర్యావరణం, కోర్టు వివాదాలు, సహకార ఉద్యమం సహా జాతీయ పర్వదినాలు, పండుగల ప్రస్తావన ఉందన్నారు. ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్యం, హిజ్రా, న్యాయం లాంటి అనేక అంశాలపై తమ అభిప్రాయాలు వెలువరించిన ఈ పుస్తకం... ఉద్యోగంతోపాటు సమాజం పట్ల జోషి చేసిన అధ్యయనాన్ని తెలియజేస్తుందని తెలిపారు.