మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డామని.. కానీ ముప్పు ఇంకా తొలగిపోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర సూచనలు పాటించాలని.. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జలవిహార్(jalavihar)లో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బండారు దత్తాత్రేయ గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు తన హృదయానికి దగ్గరగా ఉంటాయన్నారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని ఉద్ఘాటించారు.
కులమతాలను పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకు వెళ్లాలనేదే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి విశిష్టమైందని వెల్లడించారు. తెలంగాణలో బతుకమ్మ, బోనాల పండుగలు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సంస్కృతిని తెలుపుతుందన్న వెంకయ్య... రాష్ట్రంలోని ప్రతిఒక్కరు ఈ పండుగలో పాల్గొనాలని సూచించారు.