ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేరస్థులపై ఉక్కుపాదం మోపుతాం: విజయవాడ సీపీ - విజయవాడ వార్తలు

విజయవాడలో రౌడీయిజం... గ్యాంగ్‌వార్‌.. ఘర్షణలు వంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటే ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తే సహించబోమని... నగర బహిష్కరణతోపాటు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌ కేసుకు సంబంధించి ఆయన వివరాలు వెల్లడించారు. ఏడు సెంట్ల స్థలం విషయంలో మధ్యవర్తిత్వం వ్యవహారంలో తలెత్తిన స్పర్థలే... ఈ దాడికి పురిగొల్పాయని తెలిపిన సీపీ... నగరంలో గ్యాంగ్‌లు ఏవీ లేవని స్పష్టం చేశారు.

viayawada gang war
విజయవాడ గ్యాంగ్​వార్ కేసు

By

Published : Jun 5, 2020, 10:17 PM IST

విజయవాడ గ్యాంగ్​వార్ కేసు

ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగర వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే అసాంఘిక, వ్యతిరేక శక్తులు, నేరస్థులపై ఉక్కుపాదం మోపుతామని... సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. విజయవాడ గ్యాంగ్​వార్​ కేసులో 13 మందిని అరెస్టు చేశామన్న సీపీ.. ఇంకొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో నిందితుల కోసం ఆరు బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.

అసలేం జరిగింది...

విజయవాడ పటమట తోటవారివీధిలోని బహిరంగ స్థలంలో మే 30వ తేదీ సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ ఆర్థిక వివాదంలో ఇద్దరు వ్యక్తుల తరఫున మధ్యవర్తిత్వం చేస్తోన్న వారితో పంచాయతీ నిర్వహించిన క్రమంలో తలెత్తిన మనస్ఫర్ధలే ఈ దాడికి కారణమైందని సీపీ పేర్కొన్నారు. రెండు గ్రూపుల్లో ఓ గ్రూపునకు తోట సందీప్‌... మరో గ్రూపునకు కోడూరి మణికంట అలియాస్‌ పండు నాయకత్వం వహిస్తున్నారు. దాడి అనంతరం తీవ్ర గాయాలతో విజయవాడ లిబర్టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 31వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు తోట సందీప్‌ మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన పండును తొలుత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ.. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరంతా పటమట, యనమలకుదురు, కానూరు ప్రాంత వాసులే.

ఆర్థిక లావాదేవీలే వివాదానికి కారణం

యనమలకుదురుకు చెందిన ప్రదీప్‌రెడ్డి... కానూరుకు చెందిన ధనేకుల శ్రీధర్‌ ఇద్దరు 2018లో యనమలకుదురులో ఏడు సెంట్ల భూమిలో 14 ప్లాట్లతో గ్రూపు హౌస్‌ నిర్మాణం ప్రారంభించి - 2019లో పూర్తి చేశారు. ప్రదీప్‌రెడ్డి సుమారు 40 లక్షల రూపాయలు ఈ నిర్మాణానికి తనవంతుగా పెట్టుబడి పెట్టారు. మిగిలిన మొత్తం ఖర్చును శ్రీధర్‌ సమకూర్చుకున్నారు. ప్రదీప్‌రెడ్డి తనకు రావాల్సిన ప్లాట్ల గురించి ... శ్రీధర్‌తో ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడమని... బట్టు నాగబాబు అలియాస్‌ చిన్న నాగబాబును మధ్యవర్తిత్వం కోసం ఆశ్రయించారు.

మే 29న ప్రదీప్‌, శ్రీధర్‌తో నాగబాబు భేటీ అయిన సమయంలోనే తోట సందీప్‌, పండు కూడా అక్కడికి చేరుకున్నారు. తాను మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్లిన కేసులో తనకంటే జూనియర్‌... తన వద్ద అనుచరుడిగా చేసిన పండు రావడాన్ని తప్పుపట్టిన సందీప్‌ గట్టిగా ఫోన్‌లో నిలదీయడం... ఒకరినొకరు దూషించుకోవడం... అదే రోజు అర్ధరాత్రి పండు ఇంటికి తన అనుచరులతో సందీప్‌ వెళ్లి గొడవ పడడం.. వీరి మధ్య ఘర్షణను రాజేసింది. మే 30వ తేదీ ఉదయం పండు తన అనుచరులతో కలిసి సందీప్‌ నిర్వహిస్తోన్న స్టీల్‌ దుకాణం వద్దకు వెళ్లి అక్కడ సందీప్‌ లేకపోవడం వల్ల దుకాణంలోని ఇద్దరిని కొట్టి గాయపరిచాడు. ఈ క్రమంలో వివాదం ముదిరి సందీప్ ‌- పండు ఒకరినొకరు సవాల్‌ చేసుకునే వరకు వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఎవరికి వారు మారణాయుదాలతో తమ అనుచరులను వెంటబెట్టుకుని గొడవ పడ్డారు.

మూడు కేసులు నమోదు..

ఈ దాడికి ముందు- తర్వాత పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు మూడు కేసులు నమోదు చేశారు. సందీప్‌ దుకాణం వద్ద జరిగిన దాడి ఘటనపై ఇంకా తమకు ఫిర్యాదు రాలేదని - వస్తే నాలుగో కేసు నమోదు చేస్తామని సీపీ తెలిపారు. అరెస్టు చేసిన 13 మంది నిందితుల నుంచి కత్తులు, ఇనుపరాడ్లు, పది బ్లేడులు, మూడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం..

దాడికి నాయకత్వం వహించిన సందీప్‌పై 13 కేసులు... పండుపై మూడు కేసులు... పండు తల్లిపై రెండు కేసులు ఉన్నాయని... 2016లో హైకోర్టు ఉత్తర్వులతో సందీప్‌పై రౌడీషీట్‌ తీసేశారని సీపీ తెలిపారు. పండు.. ఇతరుల టిక్‌టాక్‌ వీడియో దృశ్యాలను తాము క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని... తమ సోషల్‌ మీడియా నిఘా విభాగాన్ని మరింత అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పండు మానసిక స్థితికి సంబంధించి తమకెలాంటి వైద్య ధ్రువపత్రాలు లభ్యం కాలేదని.. చిన్నతనంలో అతని ఎదుగుదల కొంత తక్కువగా ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. ఈ దాడి వెనుక రాజకీయ నేతల ప్రమేయం లేదని... ఈ గ్రూపుల్లోని కొందరిని రాజకీయ వ్యక్తులు ఉపయోగించుకున్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు.

ఘర్షణ జరిగిన తర్వాత పండు తల్లి నుంచి వాట్సాప్‌లో ఓ ఫిర్యాదు వచ్చిందని సీపీ తెలిపారు. ఆర్థిక లావాదేవీల అంశానికి సంబంధించి ప్రదీప్‌ నుంచి స్పందన కార్యక్రమంలో ఓ అర్జీ వచ్చిందని - సివిల్‌ వివాదం అయినందున - కొవిడ్‌ బందోబస్తులో పోలీసులు ఉన్నందున ప్రదీప్​, శ్రీధర్​ను పిలిపించి కౌన్సిలింగ్​ ఇచ్చి పంపించామని పోలీసులు తెలిపారు.

ఓ రాజకీయ పార్టీ తరఫున సందీప్‌, అతని భార్య కార్పొరేటర్‌గా పోటీకి ప్రయత్నించినా.. ఓటు లేనందున ఆ ప్రయత్నం విరమించుకున్న విషయం వాస్తవమేనని సీపీ తెలిపారు. అయితే ఈ గొడవకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

విజయవాడ గ్యాంగ్​వార్ కేసు: 7 సెంట్లే వివాదానికి కారణం

ABOUT THE AUTHOR

...view details