విజయవాడలోని ప్రైవేట్ కొవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోయారని మంత్రులు తెలిపారు. విజయవాడ ఏలూరు రోడ్డులో హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఉంది. రమేష్ హాస్పిటల్ దీన్ని అద్దెకు తీసుకుని, కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది. ఆస్పత్రిలో బెడ్ల కొరత కారణంగా కొందరిని ఈ హోటల్‌లో ఉంచి చికిత్స అందిస్తోంది. ఘటన సమయంలో ఈ ఆస్పత్రిలో 31 మంది రోగులు, వైద్య సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది.
విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి, హోటల్ యాజమాన్యాలపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 48 గంటల్లో దర్యాప్తు పూర్తిచేసేందుకు 2 కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా స్వర్ణ ప్యాలెస్‌లోని సీసీ కెమెరా దృశ్యాల హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
స్వర్ణప్యాలెస్ ప్రమాదానికి కారణమైన మంటలు తొలుత హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిసెప్షన్‌లో మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్నాయి. రిసెప్షన్ సమీపంలో విద్యుత్ వైఫల్యం వల్ల నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. రిసెప్షన్ పక్కనుంచి మెట్లు ఉండటం వల్ల పొగ మొత్తం పైఅంతస్తులకు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. వారిలో ఎక్కువ మంది పొగ పీల్చుకోవటం వల్ల చనిపోయారని.. ఇద్దరు కాలిన గాయాలతో మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కరోనా రోగులు ఉన్న హోటల్ కావడంతో సహాయ చర్యలు చేపట్టేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి లోపలికి వెళ్లి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.
డీజీపీ గౌతంసవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిందని తమకు ఉదయం 5:06 గంటలకు సమాచారం అందిందని సవాంగ్ చెప్పారు. విషయం తెలిసిన ఐదు నిమిషాల్లో పోలీసు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని వివరించారు. 5:45 గంటలకల్లా మంటలను ఆర్పివేసి 20 మందికిపైగా రక్షించామన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కిందికి తీసుకువచ్చారు.
రూ.50 లక్షల చొప్పున పరిహారం: సీఎం
అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే తక్షణ చర్యలకు ఆదేశించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరాతీశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని తనకు నివేదించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని ఫోన్..
ప్రధాని మోదీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక ప్రైవేటు హాస్పిటల్ ఈ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లను ఉంచిందని, తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగిందని సీఎం జగన్ ప్రధానికి చెప్పారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని వివరించారు. కొందరు చనిపోయారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధాని మోదీకి జగన్ తెలిపారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి...