జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీపై ధర్మాసనం ముందు వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన ఎన్నికల్ని పునప్రారంభించేటప్పుడు పోలింగ్ తేదీకి 4 వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందన్నారు. నాలుగు వారాల ముందు కోడ్ అమలు అవసరం లేదని.. మున్సిపల్ ఎన్నికల విషయంలో నిబంధనను అమలు చేయకపోయినా ఎవరూ అభ్యంతరం లేవనెత్తలేదని అన్నారు. సింగిల్ జడ్జి తీర్పులో ఎన్నికల కమిషనర్ పై చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఎన్నికల ఫలితాల ప్రకటనకు అవకాశం ఇవ్వాలని కోరారు.