తెదేపా కార్యకర్త బొబ్బూరి వెంగళరావుని సీఐడీ అధికారులు విచారణ పేరుతో తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన బొబ్బూరి వెంగళరావు ఎంబీఐ చదివి బెంగళూరులో ఉంటున్నారు. ఘర్షణ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వైకాపా ప్రభుత్వ తీరుపై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సీఐడీ పోలీసులు వెంగళరావుని అరెస్టు చేశారు. గురువారం కుప్పంలో జరిగిన ఘటనను నిరసిస్తూ డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా చేసిన ఆందోళనలో వెంగళరావు పాల్గొన్నారు. తిరిగి హైదరాబాదు వెళ్తున్న సమయంలో కోదాడలో సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. వెంగళరావుపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐడీ డీఐజీ సునీల్ నేతృత్వంలోని బృందం వెంగళరావుని పలు దఫాలుగా విచారించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో వెంగళరావు నడవటానికి ఇబ్బంది పడ్డారు. కొవిడ్ పరీక్షతో పాటు బీపీ, పల్స్రేట్ వంటి పరిక్షలు నిర్వహించిన అనంతరం మళ్లీ సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు.
సీఐడీ కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో గుంటూరు 6వ అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కోర్టు సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అయితే విచారణ సమయంలో సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టినట్లు వెంగళరావు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన వెంగళరావు తనని సీఐడీ వారు బట్టలు విప్పి విపరీతంగా కొట్టారని తెలిపారు. బలవంతంగా కాగితం మీద సంతకం చేయించుకున్నారని సంతకం పెట్టకపోతే మళ్ళీ కొడతామన్నారని ఆరోపించారు. 'తాము చెప్పినట్లు వింటేనే బతుకుతావు. లేదంటే నువ్వు నీ కుటుంబం కూడా మిగలదు' అని బెదిరించినట్లు న్యాయమూర్తికి వివరించారు. వెంగళరావు వాంగ్మూలంతో పాటు ఆయనకు తగిలిన గాయాలను న్యాయమూర్తి పరిశీలించారు. ఎలా కొట్టారని వెంగళరావుని ప్రశ్నించగా రెండు చేతులు పైకి కట్టేసి చేతి మధ్యలో కర్ర పెట్టి అరి కాళ్ళ మీద కొట్టారని తరువాత బల్ల మీద పడుకోబెట్టి నడుము పై కూర్చుని కాళ్లు పైకి ఎత్తి కొట్టారని వివరించారు. సున్నితమైన ప్రదేశాల్లో సైతం దాడి చేశారని తెలిపారు. దీంతో వెంగళరావుకి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని జీజీహెచ్ వైద్యులను న్యాయమూర్తి ఆదేశించినట్లు న్యాయవాదులు తెలిపారు.