తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకుండా పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు అవమానించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. నవంబర్ 1న నవనిర్మాణ దీక్షల పేరిట విజయవాడ సహా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయింది తప్ప ఏ మార్పులేదన్నారు.
నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని జరపాలని పలువురు చంద్రబాబుకు సూచించినా పట్టించుకోలేదని... సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రెండేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఇదే రోజున జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రానికి పొట్టి శ్రీరాములుకు సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు ఐదేళ్లు వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు తాబేదార్లు తప్ప మిగిలిన వారందరూ ఇవాళ పండుగ రోజుగా జరుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు.