కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 320 పైమాటే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సగటున పది కేసులు నమోదవుతుండటం... వాటిలోనూ అధికశాతం విజయవాడ నగరంలోనే ఉంటుండటం అందరినీ ఆందోళనకు గరుచేస్తోంది. లాక్డౌన్ సమయంలో ప్రజలను బయట తిరగనివ్వకుండా నియంత్రిస్తుంటే రోజూ ఇన్నేసి కేసులు ఎలా నమోదవుతున్నాయనే కోణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహనాల సర్వే చేపట్టారు.
నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లైన బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, చిట్టినగర్, తాడిగడప, కంట్రోల్‌రూం జంక్షన్, డాబా కొట్టుల సెంటర్లలో వేరువేరు సమయాల్లో గంటకు ఎన్ని వాహనాలు చొప్పున తిరుగుతున్నాయనే అంశంపై పోలీసులు సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపి వివరాలు, కారణాలు నమోదు చేశారు. ఈ ఆరు కూడళ్లలోనే గంట వ్యవధిలో సగటున 18 వందలకుపైగా వాహనాలు తిరిగితున్నాయని అధికారులు గుర్తించారు.