కూరగాయల కొనుగోలుకు వెళ్తున్న వినియోగదారులకు.. వాటి ధరలు చూసి.. గుండెల్లో దడపుడుతోంది. భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు కూరగాయలంటేనే వణికిపోతున్నారు. కూరగాయల ధరలపై నియంత్రణ కరవై.. ఎవరూ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రైతు బజార్లకు కూరగాయల రాక తగ్గింది. వర్షాలు, కృష్ణానదికి వరదలతో లంక గ్రామాల్లోని ఆకుకూరలు, కూరగాయల పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. దీంతో అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారు.
వినియోగదారులను హడలెత్తిస్తున్న కూరగాయలు - ఆంధ్రప్రదేశ్ కూరగాయల ధరలు
ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వినియోగదారులు.. ధరల మోత చూసి భయపడుతున్నారు.. జేబులకు చిల్లు పడుతున్నా.. కూరగాయల సంచి మాత్రం నిండటం లేదని వాపోతున్నారు.
విజయవాడ వన్‌టౌన్ కూరగాయల మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు టన్నుల్లో కూరగాయలు తెస్తుంటారు. ఇక్కడ రైతుబజార్ లేదు. బహిరంగ మార్కెట్లోని ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. టమోటా, పచ్చి మిర్చి, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం ఇలా అన్ని రకాలూ.. వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. 10 రోజుల కిందట కిలో 25 రూపాయలు ఉన్న టమోటా ప్రస్తుతం 40 దాటింది. పచ్చి మిర్చి 20 నుంచి 35కు, క్యారెట్ 12 నుంచి 34 రూపాయలకు పెరిగాయి. ఏ కూరగాయను ముట్టుకున్నా రెట్టింపు ధర పలుకుతోంది.
స్వరాజ్య మైదానంలో ఉన్న రైతు బాజర్ను అధికారులు ఖాళీ చేయించి కృష్ణలంక జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. వాహనాల రద్దీ వల్ల రైతు బజార్ కు వచ్చే వినియోగదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. రైతుబజార్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని.. వినియోగదారులతో పాటు అమ్మకందారులూ కోరుతున్నారు. కూరగాయల ధరల నియంత్రణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: