నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 24వ వార్డులో.. ఎస్సీ వర్గానికి చెందిన తెదేపా అభ్యర్థి దార్ల రాజేంద్ర పసుపు చొక్కాను విప్పించిన ఎస్సైపై.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దార్ల రాజేంద్ర పసుపు చొక్కా ధరించినందుకు.. ఎస్సై వెంకటేశ్వర్లు తెదేపా అభ్యర్థి చెంపపై కొట్టి, కులం పేరుతో దూషించారనీ.. చొక్కా విప్పించి అర్ధనగ్నంగా పట్టపగలు ఎండలో నిలబెట్టారని ఆరోపించారు. పసుపు చొక్కా ధరించటమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఎస్సై వెంకటేశ్వర్లు చర్య .. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమేనని లేఖలో పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. దళితుల కిడ్నాప్‌లు, ఆస్తుల విధ్వంసం, వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, రేప్‌లు, బలవంతపు ఆత్మహత్యలు, అవమానాలు, అరెస్టులు.. వంటి సంఘటనలు నిత్యకృత్యాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.