మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో సీబీఐ చెప్పాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ కేసులో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి 100 రోజులు పూర్తయినందున పురోగతి ఏంటని ప్రశ్నించారు. దీనిపై విచారణను ప్రభుత్వం ఎంతవరకు పరిశీలించిందో సీఎం చెప్పాలన్నారు. ఇప్పటివరకు జరిగిన దానిపై సీబీఐ ప్రకటన విడుదల చేయాలని కోరారు.
'వివేకా హత్య కేసులో మేం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. సీబీఐను డిమాండ్ చేస్తున్నాం. ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది. మీరు ఎంతమందిని విచారించారు. ఎన్ని సాక్ష్యాలు సేకరించారు. వీటన్నింటిపై సీబీఐ ఒక ప్రకటన విడుదల చేయాలి. లేకపోతే విచారణ జరగకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసేలా కేంద్ర హోంశాఖకు లేఖ రాయగలరా అని సీఎం జగన్‌ను అడుగుతున్నాం' -వర్ల రామయ్య, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు