Varla letter To CM Jagan: జగన్ అరాచక పాలనలో గతేడాది అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఈ నూతన సంవత్సరమైనా.. ప్రజాస్వామికంగా పరిపాలించి రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి సహకరించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా మారి అప్పుల రాష్ట్రంగా పేరుగాంచిందన్నారు. సీఎం అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రంలో వైద్యరంగం పడకేసిందన్నారు.
గతేడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వర్ల లేఖలో పేర్కొన్నారు. మహిళలపై 21.45 శాతం, ఎస్సీ, ఎస్టీలపై 4.37శాతం, చోరీలు, దొంగతనాలు 15.37 శాతం, భౌతిక దాడులు 5.81 శాతం మేర నేరాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించి కేసులు 73 శాతం పెరిగిపోయి మత్తు పదార్థాల కారణంగా 385 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.