ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా కేసులో అతడిని అరెస్టు చేయకుండా.. జగన్ అడ్డుకుంటున్నారు: వర్ల రామయ్య

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్​ను అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అడ్డుకుంటున్నారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. వివేకా కేసులోని సాక్ష్యాలన్నీ అవినాశ్ ప్రమేయాన్ని ఎత్తిచూపుతుంటే.. అతడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని సీబీఐని ప్రశ్నించారు.

వివేకా కేసులో అతడిని అరెస్టు చేయకుండా జగన్ అడ్డుకుంటున్నారు
వివేకా కేసులో అతడిని అరెస్టు చేయకుండా జగన్ అడ్డుకుంటున్నారు

By

Published : Feb 25, 2022, 7:35 PM IST

Updated : Feb 25, 2022, 7:51 PM IST

మాజీ మంత్రి వివేకా హత్యకేసులోని సాక్ష్యాలన్నీ ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయాన్ని ఎత్తిచూపుతుంటే.. అతడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని తెదేపా నేత వర్ల రామయ్య సీబీఐని నిలదీశారు. అవినాశ్​ను అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అడ్డుకుంటున్నారని విమర్శించారు.

వివేకా హత్య కేసులో ఆది నుంచీ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. బాబాయ్​ని ఎవరు చంపారో.. జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసి నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. బాబాయ్ పై అంతప్రేమ ఉంటే, కడప ఎంపీ టిక్కెట్​ను వివేకా కుటుంబసభ్యులకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

అవినాశ్ రెడ్డి పెద్దనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి సంచలన వాంగ్మూలం
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వై.ఎస్‌. అవినాశ్‌రెడ్డి పెదనాన్న వై.ఎస్‌. ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16వ తేదీన సీబీఐకి ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. గుండెపోటుతో రక్తపువాంతులు చేసుకుని వివేకా మృతి చెందినట్లు.. తన సోదరుడు వై.ఎస్. మనోహర్‌రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆరున్నరకే తనకు చెప్పారన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి అందరికీ చెప్పేశారని అన్నారు. ఆ తర్వాత వివేకానందరెడ్డి ఇంటికి తాను వెళ్లినట్లు చెప్పారు.

సీబీఐకి ప్రతాప్​ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆయన మాటల్లోనే..
ఉదయం 7.20 గంటలకు వివేకా ఇంటికి వచ్చాను. అప్పటికే ఇంట్లో వై.ఎస్.అవినాశ్ రెడ్డి, వై.ఎస్. భాస్కర్ రెడ్డి, వై.ఎస్.మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఉన్నారు. నేను లోపలికి వెళ్లగానే వై.ఎస్.అవినాశ్ రెడ్డి ఎక్కువసేపు గార్డెన్​లో ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూశాను.

  • బెడ్ రూంలో ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఇనాయ్ తుల్లా ఉన్నారు. బెడ్ రూంలో నేలపైన, పరుపు, దిండు కవర్లు, బెడ్ షీట్లకు రక్తపు మరకలు ఉన్నట్లు గమనించాను. వివేకా మృతదేహం బాత్ రూంలో ఉన్నట్లు ఎంవీ కృష్ణారెడ్డి చెబితే.. వెళ్లి చూశా.
  • రక్తపు మడుగులో నుదటిపై బలమైన గాయాలతో వివేకా మృతదేహం కనిపించింది. రక్తపు మడుగులో పడిన మృతదేహాన్ని చూసిన తర్వాత ఇది గుండెపోటు కాదని.., ఏదో జరిగిందనే అనుమానం వచ్చింది. గుండెపోటుగా ప్రచారం చేయడానికి అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి చర్చించుకుంటున్నారు.
  • బాత్ రూం, బెడ్ రూంలో రక్తపు మరకలు వెంటనే తుడిచి వేయాలనే విధంగా ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి హడావుడి చేయడాన్ని చూసి ఆశ్చర్య పోయాను. అప్పటి సీఐ శంకరయ్య సంఘటనా స్థలానికి వచ్చినా ఎవ్వరూ లెక్కచేయలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఆధారాలు తుడిపేస్తున్నారు. ఇది చాలా ఇబ్బంది అవుతుందేమో సార్ అని సీఐ శంకరయ్య నాతో అన్నారు.
  • ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి రక్తపు మరకలు తుడిపించే సమయంలో భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఆధారాలు చెరిపేస్తుంటే తట్టుకోలేక నేను ఇంటికి వెళ్లిపోయాను. నేను ఇంటికి వెళ్లే సమయంలోనే బాడీ ప్రీజర్ వచ్చింది. కానీ అది ఎవరు తెచ్చారో గమనించలేదు. వివేకాది హత్య అనే అర్థమైంది. దాన్ని కప్పిపుచ్చేందుకు శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ప్రణాళిక రచించినట్లు తెలిసింది.

వివేకానందరెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న ప్రతాప్ రెడ్డి.. చనిపోవడానికి వారం ముందు పులివెందులలోని తన కార్యాలయానికి వచ్చి అరగంటపాటు పలు విషయాలపై చర్చించారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. కడప ఎంపీ టికెట్ తనకు లేదంటే షర్మిల లేక విజయమ్మకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వివేకా మాటల్లో కనిపించిందన్నారు.

"అవినాశ్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుందని వివేకా నాతో చెప్పారు. అదే అభిప్రాయం అప్పట్లో ప్రజల్లో కూడా ఉండేది. వివేకానందరెడ్డి మంచి రాజకీయ నాయకుడు. ప్రజల్లో మంచిపేరుంది. వివేకా, ఎర్రగంగిరెడ్డి తరచూ భూమి సెటిల్​మెంట్ కోసం బెంగళూరుకు వెళ్లేవారని టైపిస్టు ఇనాయ్ తుల్లా చెప్పారు. వై.ఎస్.భాస్కర్ రెడ్డికి వివేకానందరెడ్డికి మధ్య చాలా కాలం నుంచి విబేధాలు ఉన్నాయి. వివేకా ప్రముఖ రాజకీయ నాయకుడు కావడంతో అతనికి ప్రజల్లో మంచి పేరుందన్నారు. కానీ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి పులివెందుల్లో చిన్నచిన్న పంచాయతీలు, స్థానిక సమస్యలు పరిష్కరించేంత వరకే పరిమితమయ్యారు. వివేకాకు పేరు వస్తుండటంతో భాస్కర్ రెడ్డికి, అవినాశ్ రెడ్డికి సహజంగానే అసూయ ఉండేది. అందులో భాగంగానే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవడానికి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ప్రధానపాత్ర పోషించారు." అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రతాప్​ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి

'అందరూ ఐక్యంగా ఉండి.. సమయస్ఫూర్తితో వ్యవహరించండి': చంద్రబాబు

Last Updated : Feb 25, 2022, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details