హే చాయ్ చమక్కులు చూడరా భాయ్ అనే పాట వినగానే... ప్రతి ఒక్కరికి గుర్తొచేది చాయ్ గ్లాస్‌తో చిరంజీవి వేసే స్టెప్పులు. మనిషి నిజ జీవితంలో 'టీ' కూడా భాగమైంది. దీన్నే వ్యాపారంగా చేసుకుంటూ ఎంతోమంది స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీలో 22 ఏళ్లుగా నీలా వెంకట శ్రీనివాస్ అనే యువకుడు కూడా ఇదే కోవలోకి వస్తాడు. 'వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ' షాపు ఏర్పాటు చేసి 15 రకాలైన వెరై'టీ'లను తయారు చేస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. వేడివేడి చాయ్ అస్వాధించే యువత, ఉద్యోగులు, రాజకీయ నాయకులే కాదు ఎంతో మంది సాధారణ ప్రజలు ఈ టీ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
నూజివీడు సెంటర్..15 రకాల వెరై'టీ'లకు కేరాఫ్..!
'టీ' లేనిదే మనలో చాలా మందికి తెల్లారదంటే అతిశయోక్తి కాదు. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా గల్లీ గల్లీకి టీ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. వేసవి కాలం మినహా వర్షా, శీతాకాలం వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు. ఉదయాన్నే అక్కడకు చేరుకునే జనం... టీ తాగుతూ నలుగురితో కలిసి ముచ్చట్లు చెబుతుంటే ఆ ఆనందమే వేరు. మరికొందరమో చాయ్ చేత పట్టి పేపరులో మునిగిపోతుంటారు. కాస్త సాయంత్రమైతే చాలు చాయ్ బండ్లు జనాలతో సందడిగా మారిపోతాయి. ఇలా చాయ్ బండ్లు నడుపుతూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎంతో మంది అడుగులు కూడా వేస్తున్నారు. ఇలాంటి వాళ్ల జాబితాలోనూ 22ఏళ్లుగా టీ బండి నడుపుతున్న నీలా వెంకట శ్రీనివాస్ ఉన్నాడు. నూజివీడు నగరంలో 15 రకాల వెరైటీలతో ఎంతో మంది ఆదరాభిమానాలను పొందుతున్నాడు.
దారులన్నీ వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ షాపు వైపే..స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైనదిగా పేరుగాంచిన 'వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ' షాపుకు విజయవాడ వంటి ప్రాంతాల నుంచి కూడా యువత.. రావడం విశేషం. ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చే తేనేటి ప్రియులను 'ఈటీవీ భారత్' పలకరించగా పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. వేడి వేడి టీ తాగితేనే తమ రోజువారీ జీవనయానం ప్రారంభమవుతుందని పలువురు చెప్పగా... ఇక్కడి టీ తాగకపోతే మనసు కుదుటపడదని మరికొందరూ అంటున్నారు.
ఇదీ చదవండి : ఆదాయం... మాకెంత... మీకెంత..?