వివిధ ప్రమాదాల్లో రహదారులు రక్తమోడాయి. ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వాహనచోదకుల అజాగ్రత్త.. ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. పదమూడు మందిని గాయాలపాలు చేసింది.
పుట్టినరోజే ఆఖరిరోజైంది..
పుట్టినరోజు జరుపుకున్న కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఆత్రేయపురంకు చెందిన తాడేపల్లి వెంకట శ్రీరామమూర్తి. ద్విచక్రవాహనంపై పూతరేకుల వ్యాపారం నిమిత్తం బయలుదేరిన వ్యాపారిని.. అంతర్వేది నుంచి విజయనగరం వెళుతున్న మినీ వ్యాన్ కందాల పాలెం వద్ద ఢీకొంది.
అదే సమయంలో మినీ వ్యాన్ పక్కునున్న ఆటోనూ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఎనిమిది మంది మినీ వ్యాన్లో వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో వాన్ డ్రైవర్ రామకృష్ణ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'అంబులెల్స్ ఆలస్యమే ప్రాణాలు తీసింది'
విశాఖ జిల్లా కశింకోట జాతీయ రహదారిపై.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. బుద్ద లక్ష్మి అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ లక్ష్మిని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే 108కి ఫోన్ చేయగా.. సకాలంలో స్పందించలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించడం కోసం గంటన్నరపాటు అంబులెన్స్ కోసం వేచిచూడాల్సి వచ్చిందని తెలిపారు. 108 సకాలంలో రాకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.