రాష్ట్రంలో మహిళలపై దాడులు, శాంతి భద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహించి హోంమంత్రి సుచరిత తన పదవికి రాజీనామా చేస్తే.., గౌరవంగా ఉంటుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సూచించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే స్పందించకుండా భజన బృందంలో చేరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను సమర్థించటం దుర్మార్గమన్నారు.
"ఆడబిడ్డలు బలైతే బయటకు రాని హోంమంత్రి..,జగన్ని ఎవరైనా విమర్శిస్తే మాత్రం స్క్రిప్టు పట్టుకుని బయటకు వస్తున్నారు. హోం మంత్రిగా సుచరిత బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్ల కాలంలో మహిళలపై 500కు పైగా దాడులు జరిగితే అది శాంతి భద్రతల వైఫల్యం కాదా?. హోంమంత్రిపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. లేని దిశ చట్టంలో ముగ్గురికి ఉరిశిక్ష వేయటంతో పాటు చాలామందిని శిక్షించామని ఎలా చెప్పారని అయ్యన్న ప్రశ్నించటం తప్పా. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలపై అతీగతీ లేకపోవటం శాంతిభద్రతల ఉల్లంఘన కాదా?. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం విచ్చలవిడిగా జరుగుతుంటే ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు. ప్రజలు ఏం చెప్తే అది వింటారనుకోవటం భ్రమే. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన జోగి రమేశ్ ప్రతిపక్షనేతకు విజ్ఞాపన పత్రం ఇవ్వడమేంటి. అలా ఇవ్వాలనుకున్నప్పుడు అనుమతి తీసుకోవాలని తెలియదా. విజ్ఞాపన ఇచ్చే వాళ్లు కర్రలు, రాళ్లు, మారణాయుధాలు వెంట తీసుకెళ్తారా." -అనిత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు