వైకాపా ఏడాదిన్నర పాలనలో మహిళలపై 400కు పైగా దాడులు జరిగాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. వైకాపా నేతల్లో కొందరు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే..మరికొందరు అత్యాచారాలు చేసిన వారికి మద్దతుగా నిలవటం దుర్మార్గమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళను అత్యాచారం చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
అనంతపురం జిల్లాలో బాలికపై లారీ డ్రైవర్ అత్యాచారం చేస్తే.. ఎంపీ గోరంట్ల మాధవ్ నిందితుడికి రక్షణగా నిలవటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలి సజీవ దహనంపై హోంమంత్రి స్పందించకపోవటం దారుణమన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లకు కష్టమొస్తే ఇలానే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా ? అని నిలదీశారు. రాష్ట్రంలో అసలు మహిళా కమిషన్ ఉందా అని దుయ్యబట్టారు.
ఉద్యోగాల క్యాలెండర్ ఊసేది?
నిరుద్యోగులకు ప్రతి ఏటా జనవరి 1న ఉద్యోగాల భర్తీకి సంబంధిచిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న సీఎం జగన్ హామీ ఏమైందని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ నిలదీశారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారన్నారు. ఏడాదిన్నరలో సొంత వర్గానికి సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాల పేరుతో 4 వేల కోట్లు దోచిపెట్టారే తప్ప ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు కడుపుమండి జగన్ పదవి ఊడగొట్టకముందే వారికిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.