అమరావతి రైతులు న్యాయం కోసం 600 రోజులుగా నిరసనలు చేస్తుంటే.. ప్రభుత్వం వారిపై నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని.. ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. జగన్ కు ఏ అనుభవం, చరిత్ర లేకపోయినా... కేవలం వైఎస్సార్ చేసిన కొన్ని మంచి పనులు చూసి ప్రజలు వైకాపాకు అధికారం ఇచ్చారని చెప్పారు. అలాంటి ఇచ్చిన ప్రజలపైనే అధికార దుర్వినియోగానికి పాల్పడటం దుర్మార్గమన్నారు.
గతంలో.. రాజధాని అమరావతికి స్వాగతం పలికి రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. నేడు భూములిచ్చిన రైతులను మోసం చేశారని ఆక్షేపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని అమరావతి రైతులకు న్యాయం చేయాలన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనల్లో భాగంగా విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టామని ఆయన వెల్లడించారు.