రైతులను ఆదుకోవాల్సిన ప్రధాని మోదీ అబద్ధాలు మాట్లాడటం శోచనీయమని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆక్షేపించారు. జయప్రకాశ్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వంటి మేధావులు కూడా వ్యవసాయ నల్ల చట్టాలను సమర్థించటం మంచి పరిణామం కాదన్నారు. ఒకసారి వారు చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. చలిలో ఆందోళన చేస్తున్న రైతుల పట్ల జాలి, దయ లేకుండా సూదుల్లాంటి వ్యాఖ్యలు చేస్తూ బాధపెట్టడం ఎంత వరకు సబబు అని ప్రధాని మోదీని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. రైతు బిల్లులపై ఏమైనా చట్టపరమైన సమస్య వస్తే దాని మీద అప్పీల్ చేయటానికి రైతు దిల్లీ వెళ్లగలడా అని ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజన అని పెట్టి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తున్నారన్నారు. కనీసం చర్చ జరపకుండా వ్యవసాయ చట్టాలను ఆమోదించుకున్నారన్నారు. ఇప్పటివరకు చనిపోయిన 30 మంది రైతులకు నివాళులర్పిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు.