అవసరాలు, ఆపదలు కొత్త మార్గాలను చూపిస్తాయి. కరోనా కష్టకాలమూ ఎన్నో ప్రత్యామ్నాయాలను సృష్టిస్తోంది. పర్వతారోహణలో ఆక్సిజన్ కొరత ఎదురైతే.. ఎసిటోజోలమైడ్ వంటి మందులు వాడతారు. కరోనా బాధితులకు వెంటిలేటర్ల కొరత నేపథ్యంలో ఆక్సిజన్‌ను పొదుపుగా వాడుతూనే... ప్రత్యామ్నాయంగా ఈ ఔషధాలు వినియోగిస్తున్న వైద్యులు ఫలితాలను సాధిస్తున్నారు. అమెరికాలో ప్రముఖ హృద్రోగ నిపుణులు, తెలుగువారైన డాక్టర్ బిక్కిన మహేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూజెర్సీలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుగా సేవలందిస్తున్న మహేష్ ‘ఈటీవీ భారత్’తో పలు విషయాలు పంచుకున్నారు.
భరోసా వచ్చింది
అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌లుగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీల్లో కేసుల సంఖ్య ప్రస్తుతం కాస్త తగ్గింది. దీంతో వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చన్న భరోసా ఏర్పడింది. చైనాని అమెరికా నమ్మకపోయినా.. ఇటలీ, స్పెయిన్‌లో వైరస్ వ్యాప్తి ఉద్ధృతినైనా అంచనా వేసి అప్రమత్తమైతే బాగుండేది. ఈ విషయంలో అమెరికాదే తప్పు.
కొవిడ్-19 ఎందుకింత ప్రమాదకరమంటే..
ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి శరీరానికి ప్రాణ వాయువు అందకుండా చేస్తుంది. కరోనా సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడంతో సైటోకైన్ అనే ప్రొటీన్ విపరీతంగా పెరిగిపోతుంది (సైటోకైన్ స్టార్మ్). దీంతో రోగికి ఆక్సిజన్ అందకపోవడం, రక్తం సరఫరా కాకపోవడం, కిడ్నీలు, కాలేయం చెడిపోవడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఆ సైటోకైన్ స్టార్మ్‌ను నిలువరిస్తే మరణాల రేటును తగ్గించవచ్చు.
80% మందికి ఎలాంటి సమస్యా ఉండదు
కరోనా సోకిన వారిలో 80% మందికి ఎలాంటి లక్షణాలుండవు. ఒకవేళ ఉన్నా జలుబు, దగ్గు వంటి సాధారణ ఫ్లూ కనిపిస్తాయి. 15% మంది రోగులకు న్యూమోనియా వస్తుంది. వారికి ఆసుపత్రిలో ఆక్సిజన్ ఇస్తాం. మిగతా 5% మంది సంక్లిష్ట పరిస్థితిలో ఉంటారు. వీరి ఊపిరితిత్తులను మీగడ వంటి తెల్లటి చిక్కటి ద్రవం ఆవరిస్తుంది. ఎక్స్‌రే కూడా తెలుపు రంగులో కనిపిస్తోంది. రక్తం, ఆక్సిజన్ అందక క్రిటికల్ కండిషన్‌లోఉండే వీరికి కృత్రిమ ప్రాణాధార వ్యవస్థ(వెంటిలేటర్)పై చికిత్స అందిస్తాం.
బ్లాక్స్ లేకున్నా ప్రమాదకరంగా ఈసీజీ రీడింగ్