రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా విద్యుత్ డిమాండ్ సుమారు 200 మిలియన్ యూనిట్లుగా ఉంటోంది. దీనికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో లోడ్ రిలీఫ్ పేరిట కోతలు విధిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉంది. కొన్ని రోజులుగా గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య సుమారు 11వేల 500 మెగావాట్లుగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గ్రిడ్‌పై భారం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొన్నిచోట్ల వ్యవసాయానికి ఒకేసారి 9 గంటలు కాకుండా... మధ్యలో 2 గంటలపాటు నిలిపేసి మరో దఫా ఇస్తున్నారు.
రాష్ట్రంలో అనధికారికంగా విద్యుత్ కోతలు - ntpc latest news
రాష్ట్రంలో అనధికారిక విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రామాల్లో రోజూ కనీసం గంట నుంచి 2గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ముందస్తు సమాచారం లేకుండా సరఫరా నిలిపేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ నెలలో ఇప్పటివరకు మూడు రోజులే విద్యుత్ కోతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. మిగిలిన రోజుల్లో వ్యవసాయ, గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో కోతలు తప్పలేదు. ఈ నెల 3, 4 తేదీల్లో బకాయిల చెల్లింపు వివాదంతో ఎన్టీపీసీ 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపేసింది. ఆ సమయంలో లోడ్ సర్దుబాటుకు రాష్ట్రవ్యాప్తంగా కోతలు విధించారు. తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడినా... శనివారం నుంచి మళ్లీ అనధికారిక కోతలు మొదలయ్యాయి. పీక్ సమయంలో ఉదయం, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం వినియోగం కూడా క్రమేణా పెరుగుతోంది. రబీ సాగుకు అవసరమైన నీటి కోసం బోర్ల వినియోగం పెరగడం కూడా డిమాండ్ పైపైకి వెళ్లడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నెల మొదట్లో గ్రిడ్ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 10వేల500 మెగావాట్ల వరకు ఉంటే... ప్రస్తుతం 11వేల 500 మెగావాట్లకు చేరింది. లోడ్ సర్దుబాటుకు ఇప్పటి వరకు సుమారు 61.14 M.U.ల విద్యుత్ కోతలను విధించినట్లు విద్యుత్ సంస్థల రికార్డులు సూచిస్తున్నాయి.
జెన్‌కో థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు నిల్వలు తరిగిపోయాయి. ప్రస్తుతం విజయవాడ వీటీపీఎస్‌లో 1.53 లక్షల టన్నులు, కడప ఆర్టీపీపీలో 43 వేలు, కృష్ణపట్నంలో 89 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. వీటీపీఎస్‌కు 13 రేక్‌లు, ఆర్టీపీపీ కి 6 రేక్‌ల బొగ్గు రానుంది. కృష్ణపట్నం ప్లాంటుకు 75వేల టన్నుల బొగ్గు ఓడ ద్వారా అందనుంది. బొగ్గు సరఫరా ఇలాగే ఉంటే వేసవిలో జెన్‌కో థర్మల్ కేంద్రాల నుంచి ఉత్పత్తి పూర్తిస్థాయిలో అందడం కష్టమవుతుంది. ప్రస్తుతం జెన్‌కో థర్మల్ కేంద్రాల నుంచి రోజూ 90 నుంచి 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే వస్తోంది.
ఇదీ చదవండి: