Piyush Goyal: రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి నెలకొన్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్లు నోడ్‌ను 10వేల ఎకరాలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రెండుగా విభజించి అందులో సగం భూమి మాత్రమే ఇస్తాం, మిగతాది తామే అభివృద్ధి చేసుకుంటామని చెబుతోందని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో తలపెట్టిన పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక నగరాల ఏర్పాటు పరిస్థితి ఎంతవరకూ వచ్చిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కృష్ణపట్నం నోడ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన టెండరింగ్ ప్రక్రియపై పలువురు కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి కోసం నిరంతరం కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తోంది. పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకున్నప్పుడే మేం వాటిని అమల్లోకి తీసుకురాగలం. భూసేకరణతో పాటు, ఆ భూమి అంతా ఒకేచోట ఉండేలా చూసినప్పుడే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. ఉదాహరణకు చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం నోడ్‌ని తీసుకుంటే దానికి 2,500 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 2,091 ఎకరాలు సేకరించారు. ఇది మంచి పరిణామం. ఇందులో కొంత భూమిని మార్చిలో, మరికొంత ఆగస్టులో బదిలీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పనుల కోసం కాంట్రాక్టరును నియమించాలి. కేంద్రం ఈ విషయాల్లో జోక్యం చేసుకోదు. కాంట్రాక్టరు నియామకానికి ఉత్తమ టెండరింగ్ ప్రక్రియను అనుసరించాలి. ప్రస్తుతం వారి టెండరింగ్ ప్రక్రియపై చాలామంది కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌లో ప్రతిపాదించిన ఓర్వకల్లు నోడ్ కోసం 9,800 ఎకరాలు సేకరించాలని ఉద్దేశించారు. ఇప్పటివరకు 4,742 ఎకరాలు ఇస్తామని ప్రతిపాదించారు. నోడ్ అభివృద్ధి కోసం ఇంతవరకే గుర్తించినట్లు మాకు సమాచారం అందించారు. చిన్న ప్రాజెక్టులకు పెద్ద పరిశ్రమలను ఆహ్వానించడం చాలా కష్టం. రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అప్పుడే ఇలాంటి ప్రాజెక్టులను వేగంగా చేపట్టడానికి వీలవుతుంది. ఓర్వకల్లు నోడ్‌లో పారిశ్రామిక కారిడార్‌కు కేటాయించిన భూమి పక్కన 4,500 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ మౌలిక వసతులతో సొంతంగా పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ చాలా చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ 10వేల ఎకరాలతో ఒక ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించి, ఇప్పుడు దాన్ని రెండు భాగాలుగా కోసి అందులో మీకు సగమే ఇస్తాం, మిగతా సగం మేం సొంతంగా అభివృద్ధి చేసుకుంటాం అంటున్నారు. రెండింటిలో మౌలికవసతులు భిన్నం. ఇక్కడ పనుల డూప్లికేషన్ జరగనుంది. ఇప్పుడు రెండు పారిశ్రామిక ప్రాజెక్టుల మధ్య పోటీ నెలకొంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని తొలుత ప్రతిపాదించినట్లుగానే సమీకృత ప్రాజెక్టుగా మార్చడానికి ప్రయత్నించాలని కోరుతున్నా’ అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.