గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సత్కరించారు. అవార్డు గ్రహీతలు మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. వైద్యం, సాహిత్యం, సంగీతం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా పలువురు తెలుగు వారు ప్రతిష్టాత్మక అవార్డులు పొందగలిగారన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ఘనత సాధించినందుకు తాను గర్విస్తున్నానన్నారు.
గవర్నర్ సత్కారం పొందిన వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అన్నవరపు రామస్వామి, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు, గరికిపాటి నరసింహారావు, దండమూడి సుమతీ రామ్మోహన్రావు, యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావు తదితరులు ఉన్నారు. మరణానంతరం పద్మశ్రీ అవార్డు పొందిన గోసవీడు షేక్ హసన్, ఇటీవల మరణించిన పద్మశ్రీ పురస్కార గ్రహిత డాక్టర్ అసదవాడి ప్రకాశరావు కుటుంబ సభ్యులను కూడా గవర్నర్ సత్కరించారు. నారీ శక్తి పురస్కార గ్రహీత సత్తుపాటి ప్రసన్న, వికలాంగుల జాతీయ అవార్డు విజేత షేక్ జాఫ్రీన్, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత ఎన్. ఉషను గవర్నర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.