ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం పి.ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్ చేయగా.. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని కువైట్ నుంచి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. శనివారం అరెస్టయిన ఆదర్శ్, సాంబశివరెడ్డిలను కోర్టులో ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఈ కేసులో వైకాపాకు చెందిన ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని, ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అది తేలాక వారిపై కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌సీ జోషి ఈ సందర్భంగా తెలిపారు.