తిరుమల తిరుపతి దేవస్థానానికి దాతలు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదని తితిదే మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. తాము వాటిని కాపాడలేం అని ప్రభుత్వం భావిస్తే.. నిజాయితీగా ఒప్పుకుని మరొక కమిటీని వేసి కాపాడాలని హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క సెంటు కూడా స్వామివారి భూమిని విక్రయించలేదని గుర్తు చేశారు.
స్వామివారి భూములు మంచి ప్రాంతాల్లో ఉన్నాయన్న అయన.. అవి మారుమూలల్లో ఉన్నాయని చెప్పి వాటిని అమ్మి పబ్బం గడుపుకోవాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తితిదే పాలకమండలి ప్రధాన కర్తవ్యం ట్రస్టు భూములను కాపాడటమే అన్నారు. కర్తవ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ భూములను విక్రయించాలని చూస్తున్నారని మండిపడ్డారు.