తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తామంతా అండగా ఉన్నామని మనోధైర్యం కోల్పోవద్దని అఖిలపక్షనేతలు ముక్తకంఠంతో భరోసానిచ్చారు. హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన సకలభేరి సభకు పెద్దఎత్తున వచ్చిన జనులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తొలుత 15 మంది అమరులకు సంతాపం ప్రకటించారు.
కార్మికులకు అన్ని పార్టీల అండ...
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని... ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని అఖిలపక్షనేతలు విజ్ఞప్తి చేశారు. సబ్బండ వర్గాలు ఆర్టీసీకి అండగా ఉన్నారన్నారు. ఆర్టీసీ నష్టాల్లో లేదని... నష్టాల్లోకి నెట్టివేయబడిందని అఖిలపక్షనేతలు ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తమ మేనిఫేస్టోలో పెట్టలేదని తెరాస నేతలు పేర్కొంటున్నారని... మరి 30శాతం అద్దెబస్సులు, 20శాతం ప్రైవేట్ బస్సులకు కేటాయించడం తెరాస మేనిఫేస్టోలో ఉందా అని ఎంపీ రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నను కార్మికులంతా తమ నినాదాలతో బలపర్చారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే టీఎంయూ నేతలను పక్కన కూర్చోబెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడెందుకు దూరం పెడుతున్నారని విపక్షనేతలు ప్రశ్నించారు.