KCR At TRS Plenary : ఇరవై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. ప్లీనరీ వేదికను చేరుకున్న గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ ప్లీనరీలో సుమారు 3వేలు పైగా తెరాస ప్రతినిధులు పాల్గొన్నారు. గులాబీ నేత కె.కేశవరావు స్వాగత ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని ఉద్దేశించి ప్రసంగించారు.
KCR At TRS 21st Plenary : అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. నిబద్ధమైన, సువ్యవస్థీతమై కొలువుదీరిన పార్టీ తెరాస అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట అనీ... ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట అని స్పష్టం చేశారు. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదన్న సీఎం... తెలంగాణ ప్రజల ఆస్తి అని వెల్లడించారు.
KCR At TRS Plenary 2022 : రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నో ఛాత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పనితీరుకు మచ్చుతునక అని ఆయన పేర్కొన్నారు. నిన్న విడుదల చేసిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తతమ 10 గ్రామాలు తెలంగాణవే నిలిచాయని తెలిపారు.