ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ: ఎవరి బలం ఎంత?

నగరమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గ్రేటర్‌ మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికకు రంగం సిద్ధమైంది. సభ్యుల సంఖ్యను బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) సులభంగా ఈ రెండు పదవులను దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికలో తామూ పాల్గొని అభ్యర్థులను నిలబెట్టడానికి మిగిలిన రెండు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. తెరాస తరఫున ఎంపికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే పూర్తి చేశారు. గురువారం ఉదయం సీల్డ్‌కవర్‌ను పార్టీ ఎన్నికల పరిశీలకులైన మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని తెరుస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

trs bjp and mim planning to participated in ghmc mayor election today
గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ: ఎవరి బలం ఎంత?

By

Published : Feb 11, 2021, 9:51 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం 10.45 గంటలకు 149 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్‌ అఫిషియోలు బల్దియా సమావేశమందిరానికి రావాలి. 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది.11.30కు మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది.

తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలుపుతున్నాయి. పీవో, కలెక్టర్‌ శ్వేతా మహంతికి ఈ అంశంపై సంకేతాలిచ్చాయి. తమ సభ్యులకు విప్‌ జారీ చేయనున్నట్లు తెలిపాయి. పార్టీ బలపరిచిన వ్యక్తికే ఓటేయాలని ఆయా నోటీసుల్లో ఉంటుంది.

ఎవరికి బలం ఉంటే వారు

బల్దియాలోని 150 మంది కార్పొరేటర్లకు గాను తెరాసకు 56, భాజపాకు 48 మంది(వీరిలో ఒకరు చనిపోవడంతో 47) కార్పొరేటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు ఉన్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులు తెరాసకు 32, భాజపాకు 2, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. మేయర్‌ ఎన్నికకు 97 మంది సభ్యులతో కోరం ఉండాలి. ఎవరికి ఎక్కువ బలం ఉంటే ఆ పార్టీ అభ్యర్థులే ఎన్నికవడానికి అవకాశం ఉంది. 56 మంది సభ్యులున్న తెరాస రెండు పదవులనూ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. తెరాసకు ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతు అవసరం పడే అవకాశం లేకపోయినా వారినీ సభకు రప్పిస్తోంది.

ధిక్కరించిన వారిపై..

చట్ట ప్రకారం విప్‌ను ధిక్కరించిన కార్పొరేటర్లపై చర్యలు ఉంటాయి. అవతలి పార్టీ నిలిపిన మేయర్‌, ఉపమేయర్‌ అభ్యర్థికి ఓటు వేయడం, ఓటింగ్‌లో పాల్గొనకపోవడం వంటివాటికి పాల్పడితే వేటు పడుతుంది.

ఎంఐఎం బాధ్యతలు జాఫ్రీకి..

ఎంఐఎం తరఫున మేయర్‌, ఉపమేయర్‌ అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే అధికారాన్ని ఎమ్మెల్సీ జాఫ్రీకి ఇచ్చారు. తెరాస నుంచి ఎమ్మెల్సీ ప్రభాకర్‌, భాజపా నుంచి కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ విప్‌లుగా ఉంటారు.

పదవీ గండం లేదు..

జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫిషియోలుగా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విప్‌ ఉండదు. వీరు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పక్షంలో చర్యలనేవి ఆ పార్టీల పరిధిలోనే ఉంటాయి. ఇక వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నందున ఎక్స్‌అఫిషియోగా ఓటు వాడుకునేందుకు కొందరిని బల్దియా ఓటింగ్‌కు దూరంగా ఉంచి, రిజర్వు చేసుకోవాలని తెరాస యోచిస్తున్నట్లు సమాచారం.

భాజపా సభ్యులకు విప్‌ జారీ

భాజపా నుంచి ఎన్నికైన 47 మందికి ఆ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌, చింతల రామచంద్రారెడ్డి విప్‌ జారీ చేశారు. మేయర్‌ ఎన్నికలో వ్యూహాలపై బుధవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. గురువారం ఉదయం మేయర్‌ అభ్యర్థి పేరును తెలపనున్నారు. బషీర్‌బాగ్‌లోని అమ్మవారి ఆలయంలో సభ్యులంతా పూజలు చేసి నేరుగా బల్దియా కార్యాలయానికి వెళ్తారు. మేయర్‌ అభ్యర్థిగా ఆర్కేపురం డివిజన్‌ నుంచి గెలిచిన రాధా ధీరజ్‌రెడ్డి పేరును నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.

ఖరారు చేసిన తెరాస

దాదాపు ఆరుగురు మహిళా కార్పొరేటర్లు మేయర్‌ అభ్యర్థిత్వానికి తెరాస నుంచి పోటీపడుతున్నారు. బంజారాహిల్స్‌, వెంకటేశ్వరనగర్‌, తార్నాక, చర్లపల్లి కార్పొరేటర్లు గద్వాల్‌ విజయలక్ష్మి, మన్నె కవితారెడ్డి, మోతె శ్రీలతరెడ్డి, బొంతు శ్రీదేవి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో బుధవారం రాత్రి గద్వాల విజయలక్ష్మి పేరు చక్కర్లు కొట్టడంతో ఆమె నివాసం వద్ద హడావిడి నెలకొంది. ముఖ్యమంత్రి ఖరారు చేసేవరకు మేయర్‌ ఎవరనేది తెలియదని నేతలు చెబుతున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్పొరేటర్ల సమావేశంలోనే స్పష్టత వస్తుందన్నారు.

ఇళ్లలోనే జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు

మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో బల్దియా ప్రధాన కార్యాలయంలోకి అనుమతి లేని వ్యక్తులు రాకుండా బారికేడ్లు కట్టారు. అక్కడి ఉద్యోగులకూ మినహాయింపు లేదు. వారంతా గురువారం ఇంటికే పరిమితం కావాలని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ అన్ని విభాగాలకు ఆదేశాలిచ్చారు. అత్యవసరమైతే ఫోన్‌లో అందుబాటులో ఉండాలని, నగరాన్ని విడిచి వెళ్లొద్దని నిబంధన పెట్టారు. దీంతో సుమారు 2వేల మంది ఇళ్ల వద్దనే ఉండనున్నారు. కేవలం ఎన్నికల విభాగం, కార్యదర్శి కార్యాలయం, పీఆర్‌ఓ విభాగానికి చెందిన 150 మందికే మినహాయింపు ఇచ్చారు.

బల్దియా చుట్టూ పటిష్ఠ భద్రత

బల్దియా కొత్త మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో గురువారం కట్టుదిట్టమైన భద్రత చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 290 మంది సాయుధ, శాంతిభద్రతల పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తారు. మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సభ్యుల రాకపోకలకు వీలుగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. సమావేశ మందిరంలో 30 మంది మార్షల్స్‌ ఉంటారు.

నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

  • ట్యాంక్‌బండ్‌ నుంచి లిబర్టీ వైపు వచ్చే వాహనాలు అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తెలుగుతల్లి కూడలి మీదుగా వెళ్లాలి.
  • లోయర్‌ ట్యాంక్‌బండ్‌-అంబేడ్కర్‌ విగ్రహం వైపు వచ్చేవారు కట్టమైసమ్మ ఆలయం నుంచి తెలుగుతల్లి పైవంతెన మీదుగా చేరుకోవాలి.
  • హిమాయత్‌నగర్‌-అంబేడ్కర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ మీదుగా పాతపోలీస్‌ కంట్రోల్‌రూం వైపు మళ్లిస్తారు.
  • బషీర్‌బాగ్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వైపు వస్తున్నవారు బషీర్‌బాగ్‌ కూడలి నుంచి రవీంద్రభారతి మీదుగా గమ్యస్థానాలు చేరుకోవాలి.
  • తెలుగుతల్లి కూడలి-ఆదర్శ్‌నగర్‌ వైపు వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించరు. వారు ఇక్బాల్‌మినార్‌ మీదుగా వెళ్లాలి.

ప్రక్రియపై నివేదిక

బల్దియా కార్యాలయంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్‌ఈసీ పార్థసారథి.. అధికారులు సుల్తానియా, శ్వేతామహంతి, లోకేష్‌కుమార్‌

ఇవీ చూడండి:నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

ABOUT THE AUTHOR

...view details