ఆలయాలకు చెందిన భూములుకు సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు దేవాదాయశాఖ అధికారులు సిద్ధమయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లను చేయనునుంది దేవాదాయ శాఖ.
ఇటీవల కృష్ణా జిల్లాలోని ఓ మంత్రి సన్నిహితుల ఆక్రమణలో ఉన్న రెండు ఆలయాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు దేవాదాయశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకు జిల్లా రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నారు. మొన్నటి వరకు దేవాదాయశాఖ మంత్రి వద్ద పనిచేసిన ఓఎస్డీ.. పలు ఆలయాలకు చెందిన భూములకు ఎన్వోసీలు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ ఆలయాల భూములకు ఎన్వోసీల జారీ విషయంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు దేవాదాయశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇకపై త్రిసభ్య కమిటీ ప్రతి ఎన్వోసీని పరిశీలించేలా నిర్ణయం తీసుకుంది. దేవాదాయశాఖ కమిషనరేట్ స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనుంది. ఎన్వోసీ జారీ కోసం వచ్చిన ప్రతి దస్త్రాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది.
రూ.951 కోట్ల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన, ఇతర ఆలయాలకు సంబంధించి 23.56 లక్షల ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీటి విలువ రూ.951.57 కోట్ల మేర ఉంది. ఏళ్ల తరబడి ఈ అభ్యంతరాలు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో రూ.159 కోట్లు, కాణిపాకంలో రూ.122 కోట్లు, దుర్గగుడిలో రూ.110 కోట్లు, అన్నవరం ఆలయంలో రూ.70 కోట్ల ఖర్చుపై అభ్యంతరాలు ఉన్నట్లు తెలిసింది. వీటిపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయా అభ్యంతరాలు వచ్చిన సమయంలో ఈవోగా ఎవరైతే ఉన్నారో వారినే బాధ్యులను చేయనున్నారు.