రాష్ట్రంలో మద్యానికి బానిసై నిర్వీర్యమవుతున్న జీవితాలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ ఇదీ మద్యానికి పూర్తిగా బానిసై.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఓ బాధితుడి బాధ. స్నేహితుల ప్రోద్బలంతో బీర్‌తో మొదలుపెట్టి.. శానిటైజర్ వరకూ తాగేశాడీ యువకుడు. చివరకు ఆహారం కూడా తీసుకోలేక.. తనకుతాను ఏం చేస్తున్నాడో అర్థంకాని పరిస్థితిలో ఇదిగో ఇలా డీ అడిక్షన్ సెంటర్‌లో చేరాడు. ఇప్పుడిప్పుడే మద్యం ఊబి నుంచి బయటపడుతున్నా.. తాము అనుభవించిన మానసిక క్షోభ మాత్రం పగవారికీ రావొద్దంటున్నారు కుటుంబ సభ్యులు..
రోజూ పది నుంచి 15 మంది వస్తున్నారు: ఇతనొక్కడే కాదు.. తాగుడు అలవాటున్న ప్రతీ వందలో పది నుంచి 15 మంది మద్యానికి బానిసలవుతున్నారని మానసిక వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 6 శాతం మంది ఈ మహమ్మారికి బానిసలయ్యారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే. ఇక మిథైల్ ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా ఉండే సారా తాగడం వల్ల.. కొందరు కోమాలోకి వెళ్తారు.
క్రానిక్ లివర్ ఫెయిల్యూర్... కడుపులో నీరు చేరడం, రక్తహీనత, ఇతర సమస్యలతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రోజూ పది నుంచి 15 మంది వరకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఐతే.. ఇందులో కొంత మంది మాత్రమే డీఅడిక్షన్ సెంటర్లకు వస్తున్నారు. మద్యం తాగే వారికి గుండెపోటు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. నోరు, గొంతు, స్వరపేటిక, పెద్దపేగు, కాలేయ క్యాన్సర్ల బారినపడే వారిలో మందుబాబులే ఎక్కువ. ఇవన్నీ చెప్పి మందుబాబుల్లో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు డీఅడిక్షన్ సెంటర్ వైద్యులు. మద్యం వల్ల కుటుంబాలూ... చిన్నాభిన్నం అవుతున్నాయి. డీఅడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న వారిలో ఒక్కో కుటుంబానిదీ.. ఒక్కో కన్నీటి కథ.
ఇదీ చదవండి:Misbah Suicide Case Updates: మిస్బా ఆత్మహత్య కేసులో టీచర్ రమేశ్ అరెస్ట్