ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు.. వైద్యం ఎలా? - రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. బాధితుల వైద్యానికి అవసరమైన ఇంజెక్షన్లు అందుబాటులో లేక నామమాత్ర చికిత్సతో డాక్టర్లు సరిపెడుతున్నారు. యాంఫోటెరిసిన్‌ ఇంజెక్షన్లు అవసరాలకు సరిపడా అందుబాటులోకి వస్తేనే బాధితులు త్వరగా బ్లాక్‌ఫంగస్‌ నుంచి బయటపడతారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు వైద్యం ఎలా
బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు వైద్యం ఎలా

By

Published : May 23, 2021, 7:26 AM IST

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు అవసరమైన యాంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్‌ అందుబాటులో లేకపోవడంపట్ల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్‌ వచ్చేవరకూ యాంటీఫంగల్‌ టాబ్లెట్లు, యాంటీబయాటిక్స్‌తో బాధితులకు వైద్యులు నామమాత్రంగా చికిత్స అందిస్తున్నారు. బాధితుల లక్షణాలను అనుసరించి మరికొన్ని మందులు వాడుతున్నారు. ఈ బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో 4 దశలు ఉన్నాయి. కొవిడ్‌కు ముందు, తర్వాత శరీరస్వభావం ఎలా ఉంది? ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనారోగ్య తీవ్రత ఎలా ఉందన్న వివరాలు తెలుసుకొని, బాధితులు ఏ దశలో ఉన్నారో గుర్తించిన తర్వాతే అసలైన చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు వెల్లడించారు.

యాంఫోటెరిసిన్‌ ఇంజెక్షన్లు అవసరాలకు సరిపడినట్లు అందుబాటులోకి వస్తేనే బాధితులు త్వరగా బ్లాక్‌ఫంగస్‌ నుంచి బయటపడతారని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే పలువురు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక స్థోమత కలిగిన అతి కొద్దిమంది బాధితులు చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ నుంచి యాంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను తెప్పించుకుంటున్నారు. ఇలా వచ్చిన వాటినే వైద్యులు బాధితులకు ఇస్తున్నారు. ప్రతి బాధితుడు కనీసం ఆరవై ఇంజెక్షన్లను పొందాలి. కొందరు ఇప్పటికే సగం ఇంజెక్షన్లు తీసుకున్నారు. మిగిలిన డోసులు దొరక్క ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఈఎన్‌టీ వైద్య నిపుణులు యార్లగడ్డ సుబ్బరాయుడు మాట్లాడుతూ 3, 4 దశల్లో ఉన్న బాధితుల విషయమే ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఇంజెక్షన్లు లేనందున వారి పరిస్థితి మళ్లీ మొదటికొస్తోందన్నారు. రాష్ట్ర ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నందకిషోర్‌ (ఈఎన్‌టీ) మాట్లాడుతూ బాధితులకు చికిత్స అందించడంలో 25% శస్త్రచికిత్స అవసరాలు ఉంటే.. మిగిలిన 75% మేనేజ్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్న వారితో కలిపి గుంటూరు జిల్లాలో 150 వరకు కేసులు ఉన్నాయన్నారు. జిల్లాలవారీగా చూస్తే కేసులు వందల్లోనే ఉంటాయని వెల్లడించారు.

మాస్కుల విషయంలో జాగ్రత్తలు!

  • కొవిడ్‌ చికిత్స పొందుతున్న సమయంలోనూ బ్లాక్‌ఫంగస్‌ రాకుండా ఉండేందుకు నివారణ చర్యలు ఆసుపత్రుల్లో మొదలవుతున్నాయి. రోజూ ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లలో నీటిని మారుస్తున్నారు. మాస్కులను హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌తో శుభ్రం చేయాలని సూపరింటెండెంట్లు సిబ్బందికి సూచిస్తున్నారు. ప్రస్తుతానికి యాంటీఫంగల్‌ టాబ్లెట్లను బాధితులకు ఇస్తున్నారు. బాధితుడి అవసరాలు అనుసరించి యాంటిబయాటిక్స్‌ ఇస్తున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ఎన్ని రోజులకు బాధితులకు బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిందనే విషయాన్ని వైద్యులు పరిశీలిస్తున్నారు.
  • రుయాలో చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి కొవిడ్‌ చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ వచ్చింది. మరో ఇద్దరికి మాత్రం చికిత్స పొందుతున్న సమయంలోనే వచ్చినట్లు గుర్తించారు. చికిత్స పొందేవారిలో 25-72 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. స్విమ్స్‌లోనూ ఐదుగురు బ్లాక్‌ఫంగస్‌తో చికిత్స పొందుతున్నారు.
  • విజయవాడ జీజీహెచ్‌లో 23 మంది బాధితులను ఈఎన్‌టీ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్‌ చికిత్స పొందేవారిలో నలుగురికి బ్లాక్‌ ఫంగస్‌ వచ్చినట్లు గుర్తించారు.
  • అనంతపురం సర్వజన ఆసుపత్రిలో తాజాగా ఆరుగురు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో చేరారు.
  • ఒంగోలు జీజీహెచ్‌లోనే 20మంది చికిత్స పొందుతున్నారు. దీంతో రోగుల వైద్యం కోసం నిపుణుల కమిటీని నియమించామని ఒంగోలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు తెలిపారు. కృష్ణా జిల్లా పోరంకి నివాసి తాడికొండ హరికి నాలుగు రోజుల క్రితం బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో పోరంకిలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో శనివారం మృతి చెందారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన చెల్లి అశోక్‌కుమార్‌ తమిళనాడు వెల్లూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదైన తూర్పుగోదావరి జిల్లాలో 10 మందికి వ్యాధి నిర్ధారణకాగా.. అయిదుగురికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. ప్రస్తుతం 15 మందికీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ మహాలక్ష్మి తెలిపారు.

శస్త్రచికిత్సల కోసం ఏర్పాట్లు

బాధితుల్లో అవసరమైన వారికి బోధనాసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ జీజీహెచ్‌లో శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలు లేనందున వాటిని సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీజీహెచ్‌లో ఉన్న 23 కేసుల్లో పలు కేసులకు ఈఎన్‌టీ, కంటి వైద్య నిపుణులు కలిసి శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని ఈఎన్‌టీ వైద్య నిపుణులు డాక్టర్‌ రవి తెలిపారు. గత కొంతకాలంగా రుయా ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్లు అన్నీ మూసివేశారు. ప్రస్తుతం వీటిని తెరిచి ఆపరేషన్లకు సిద్ధం చేస్తున్నట్లు రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి వెల్లడించారు.

ఏపీకి 2,310 యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌

దేశవ్యాప్తంగా 8,848 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులున్నట్లు కేంద్ర మంత్రి సదానందగౌడ వెల్లడించారు. వారి చికిత్స కోసం అన్ని రాష్ట్రాలకు కలిపి 23,680 యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌ కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 910 మంది రోగుల కోసం 2,310, తెలంగాణలోని 350 రోగులకు 890 వయల్స్‌ కేటాయించారు. కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రస్తుతం బ్లాక్‌ ఫంగస్‌ రోగులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ (రోగులు-2,281), మహారాష్ట్ర (2000), ఆంధ్రప్రదేశ్‌ (910), మధ్యప్రదేశ్‌ (720), రాజస్థాన్‌ (700), కర్ణాటక (500), తెలంగాణ (350), హరియాణా (250) ముందు వరుసలో ఉన్నాయి.

ఇదీ చదవండి:

సంఘర్షణ ముగిసినా.. వారి కన్నీళ్లు ఆగలేదు!

ABOUT THE AUTHOR

...view details