Heart Transportation by Green Channel: ప్రజారోగ్యం, ప్రజల పట్ల.. తెలంగాణలోని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిబద్ధత మరోసారి రుజువైంది. ట్రాఫిక్‌ను నియంత్రించడంలోనే కాదు.. ప్రజల ప్రాణాలను కాపాడటంలోనూ వారి సేవలు ఎనలేనివి. గుండె సంబంధిత వ్యాధితో కొట్టుమిట్టాడుతున్న ఓ రోగికి.. హృదయ మార్పిడిలో తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నారు. 24 గంటలూ వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దాదాపు 14 కి.మీల దూరాన్ని కేవలం 14 నిమిషాల్లో అధిగమించారు. విజయవంతంగా అంబులెన్స్‌లో గుండెను రవాణా చేశారు.
నగరంలోని మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి ఈ ఉదయం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జీవన్ దాన్ సంస్థ వెల్లడించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌కి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్‌కు బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. 32 ఏళ్ల విజయ్ నల్గొండ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసేవారు. ఈ నెల 6 న రోడ్డు ప్రమాదానికి గురైన అతనికి మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. విజయకుమార్ గుండెను అపోలోలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చనున్నారు.