దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన రవాణా వ్యవస్థలో భారీ వాహనాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయని తెలుగు రాష్ట్రాల భారీ వాహన డ్రైవర్స్ అండ్ క్లినర్స్ హక్కుల సాధన సమితి సభ్యులు అన్నారు. డైవర్లు, క్లీనర్ల ఆర్థిక అభివృద్ధిపై యజమానులు, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, వారి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. రిటైర్మెంట్ తరువాత తమకు కూడా ప్రావిడెంట్ ఫండ్, నెలవారీ పెంక్షన్ వచ్చే విధంగా ఓ నిధిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
దీనికి అవసరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేందుకు సహాయ సహకారాలు అందించాలని ట్రాన్స్ పోర్ట్ శాఖ మంత్రి పేర్ని నానిని అభ్యర్థించారు. ఈ అంశాన్ని శాసన సభ, క్యాబినేట్ మీటింగ్లో ప్రస్తావించాలని కోరారు. దీని అమలు కోసం డ్రైవర్లు, క్లీనర్ల నుంచి తీసుకున్న సూచనలు, సలహాలు తెలిపారు. తమ సంక్షేమ నిధిని ప్రభుత్వం పర్యవేక్షించేందుకు.. ఒక ఐఏఎస్ అధికారి, ఒక రిటైర్డ్ జడ్జి, అసోసియేషన్ తరఫున జిల్లాకొకరిని నియమించాలని కోరారు. వీటి సమన్వయం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దానిని అవసరమైన నియమ నిబంధనలు రూపొందించాలని మంత్రిని అభ్యర్థించారు. ప్రభుత్వసాయంపై ఆధారపడకుండా నిలదొక్కుకునేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
సూచనలు..
* ట్రిప్ షీట్ విధానాన్ని దేశం మొత్తం కంప్యూటరీకరణ చేయాలి.
* సరకు రవాణా ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుందనే వివరాలు ట్రిప్ షీట్లో పొందుపరచాలి.
*డ్రైవర్ లైసెన్స్ నెంబర్, క్లీనర్ గుర్తింపు కార్డు ప్రతి ట్రిప్ షీట్ లో పొందుపరచాలి.
* రవాణాకు వసూలు చేసే కిరాయిలో ఒక శాతాన్ని డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమ నిధికి చెల్లించాలి. దానిని ట్రాన్స్ పోర్ట్ చేసేవారు లేదా సరుకు యజమాని గానీ ఆన్ లైన్ లో చెల్లించాలి. ఈ సొమ్మును డ్రైవర్స్ క్లినర్స్ సంక్షేమ ట్యాక్స్ (DCST)గా పరిగణించాలి.