కళాశాలలో జనపద కళలకు శిక్షణ Tribal traditions: నేటియువతరం ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకెళ్తోంది. వస్త్రాలంకరణ మొదలు అన్నిట్లోను కొత్తపోకడలు కోరుకుంటోంది. ఇలాంటి విద్యార్థులకు గిరిజన సంప్రదాయాలు, కళలు, ఆచారాల పట్ల అవగాహన కలిగించడమే కాదు... వాటిలో ప్రావీణ్యం సంపాదించేలా తర్ఫీదు ఇస్తోంది విజయవాడలోని సిద్దార్ధ మహిళా డిగ్రీ కళాశాల.
నాగరిక ప్రపంచానికి దూరంగా... కాలుష్యం లేని పచ్చని కొండ కోనల్లో జీవనం సాగించే అనేక గిరిజన జాతులు తెలుగు నేలపై ఉన్నాయి. వారి ఆహార్యం... ఆహారం... సంస్కృతి.... ఆటపాటలు అన్నీ నవతరానికి ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలే. కష్టజీవులైన అడవి బిడ్డలకు ఈ కార్యక్రమాలు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి. ఆదిలాబాద్‌లో గోండుల గుస్సాడి నృత్యం, దండారి కోలాటం, మయూర నృత్యం, జోడియా నృత్యం... కోయ నృత్యం... దింసా నృత్యం.. ఇలా ఎన్నో రకాల నృత్యాలను నేర్పిస్తున్నారు.
"విద్యార్థినులకు ఎంపిక పోటీలు నిర్వహించి, ఉత్సాహంతో పాటు శరీర కదలికల్లో చురుకుదనం... చలాకీతనం ఉన్న వారికి అర్హత కలిపించింది. ప్రతి కళకు.. ఆయా రంగాల్లో నిపుణులను తమ కళాశాలకు పిలిపించి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణ అనంతరం వారితో కలిసి కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశారు."- రాజు, శిక్షకుడు
సిద్దార్ధ మహిళా కళాశాల విద్యార్థినులకు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయస్థాయిలోని పలు సాంస్కృతిక పోటీల్లో అనేక బహుమతులు పొందిన రికార్డు ఉంది. ఇదే సమయంలో అంతరించిపోతున్న కళలను ఆదరించేందుకు గిరిజన సంప్రదాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విద్యార్ధినులు సైతం తమ చదువుతోపాటు కళలకు సమయం కేటాయిస్తూ- కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
ఇటీవల విడుదలైన బీమ్లానాయక్ సినిమా ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన కిన్నెర వాయిద్యాన్ని... పద్మశ్రీ అవార్డు పొందిన మొగులయ్య నుంచి కళాశాల నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఎన్నో పరికరాలను నేరుగా గిరిజన ప్రాంతాల నుంచే తెప్పించారు. గిరిజనుల్లో ప్రత్యేకించి కోయ జాతివారు మాత్రమే కొమ్మడోలు ఆడతారు. తలపై గొర్రె గేదె కొమ్ములు తగిలించుకొని మెడలో పెద్దడోలు వేసుకుని ఆడే ఈ కొమ్ముడోలు చాలా ప్రాచీన కళా రూపం.
పాశ్చాత్య వాయిద్య పరికరాలు, నృత్యరీతిల కంటే ప్రాచీన సంగీత పరికరాలు, నాట్యాలు తమను ఎంతో ఆకర్షిస్తున్నాయని, ఏకాగ్రతను మరింత పెంచుతున్నాయని విద్యార్ధులు సైతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Innovative Wishes: చిన్నారి టాలెంట్.. చంద్రబాబుకు వెరైటీగా బర్త్డే విషెష్