కరోనా కారణంగా కింది స్థాయి కోర్టుల్లోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ జరుగుతోంది. అత్యవసర కేసులు మాత్రమే స్వీకరిస్తున్నారు. చెక్‌బౌన్స్, ప్రామిసరీ నోట్ల వివాదాలకు సంబంధించి కేసులు లాక్‌డౌన్ ముగిశాక వేసుకోవచ్చని చెప్పటంతో బాధితులకు ఊరట లభించింది. అదే సమయంలో ట్రయల్ కోర్టుల్లో క్రాస్ ఎగ్జామిన్ చేసే అవసరం ఉంటుందని.. ఆన్‌లైన్ ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కింది కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయవాదులకు సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
లాక్‌డౌన్ ముగిశాక పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ అధిక సంఖ్యలో విచారణకు వచ్చే అవకాశం ఉందన్న న్యాయవాదులు.... ట్రయల్ కోర్టుల్లోనూ కొన్ని నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. రద్దీ నియంత్రణకు నిర్ణీత వేళలు పాటించేలా చర్యలు ఉండాలని సూచిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని న్యాయవాదులు కోరుతున్నారు.