Traffic Pending Challans: తెలంగాణ రాష్ట్రంలో రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపు గడువు శుక్రవారంతో ముగిసింది. నిన్న రాత్రి 10 గంటల వరకు వాహనదారులు 3 కోట్ల చలాన్లు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.302 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. చలాన్లు చెల్లించేందుకు ప్రజల మీద భారం పడకుండా.. హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకోగా.. మార్చి 31తో గడువు ముగిసింది. అయితే.. వాహనదారుల స్పందన, విజ్ఞప్తుల మేరకు ఈ నెల 15 వరకు ఈ అవకాశాన్ని పొడిగించారు.
మార్చి 31 వరకు 1.70 చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లు వసూలు అయ్యాయి. పొడిగించిన గడువుతో గడిచిన 15 రోజుల్లో మరో రూ.50 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈసారి గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 65 శాతం మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.