విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి ఆంధ్రా భవన్లో నిరాహార దీక్ష చేయాలని... అనంతపురం జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురంలోని వీకే భవన్లో ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధించలేని అసమర్థ ప్రభుత్వం వైకాపా అని ఆరోపించారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి వైకాపా.. అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సంసిద్ధంగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం భాజపాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని ఆదాని, అంబానీలకు ధారదత్తం చేయడానికి కుట్ర చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ ఆరోపించారు. కడప, విశాఖ ఉక్కు పరిశ్రమలు ప్రైవేటుపరం చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడు బృందాలుగా ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు అనంతపురంలో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ నెల 14, 15, 16న కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
విజయనగరంలో...
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని.. ప్రతి ఒక్కరూ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని... మానవీయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గోవిందరాజు కోరారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మానవీయ స్వచ్ఛంద సంస్థ, ఐక్య ఉపాధ్యాయ సంఘం, సత్య రామా డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసిందని.. ఈ ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని గోవిందరాజు కోరారు.