తెదేపా నేత కళా వెంకట్రావు అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాన్ని ఖండించడం కళా చేసిన తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాక్షస చర్యలకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. కళా వెంకట్రావును తక్షణమే బేషరతుగా విడుదల చేసి తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
తాను అవినీతి కుంభకోణాల్లో జైలుకు వెళ్లాడు కాబట్టి, ఏదో ఒక తప్పుడు కేసులో తెదేపా నేతలను ఇరికించి జైళ్లకు పంపాలని చూడటం జగన్రెడ్డి సైకో మనస్తత్వానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. కళా వెంకట్రావ్ వివాద రహితుడు, సౌమ్యుడు, అజాతశత్రువని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధం చేయటం ఆటవిక చర్యని ధ్వజమెత్తారు. రామతీర్థంలో రాముడి తల నరికివేస్తే, చూడటానికి వెళ్లడమే నేరమా? అని నిలదీశారు.