ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హస్తం ఆశలన్నీ ఆ నియోజకవర్గంపైనే.. అక్కడ గెలిస్తే!

గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో విజయం వరిస్తుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. పోలింగ్ సరళి మాత్రం తమకు అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది. మల్కాజిగిరి లోక్​సభ స్థానం పరిధిలోని డివిజన్లపైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.

tpcc winning estimations on ghmc elections 2020
హస్తం ఆశలన్నీ ఆ నియోజకవర్గంపైనే.. అక్కడ గెలిస్తే!

By

Published : Dec 2, 2020, 12:54 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా.. ఈసారి డబుల్ డిజిట్ ఖాయమని ధీమాగా ఉంది. 150 డివిజన్లలో 146 డివిజన్లకు పోటీ చేసిన హస్తం పార్టీ.. ఫలితాలు అనుకులంగా ఉంటాయన్న డివిజన్లపైనే ఎక్కువ దృష్టి సారించింది.

బరిలో గెలుపు గుర్రాలు..

ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 45 డివిజన్లకు సంబంధించి...అభ్యర్థుల ఎంపికలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భాజపా, తెరాసలకు గట్టి పోటీ ఇవ్వగలిగే గెలుపు గుర్రాలను బరిలో దించారు. మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా వీలైనంత మేర సత్తా చాటుతామని హస్తం నేతలు భావిస్తున్నారు. నగర వాసులు, విద్యావంతులు, ఉద్యోగులు.. ఓటు వేసేందుకు చొరవ చూపకపోవడం వల్ల అధినాయకత్వంలో కొంత నిరాశ నెలకొంది.

ఈసీ చర్యలు తీసుకోలేదు..!

గత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటర్లలో చైతన్యం తీసుకురావడంపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని హస్తం నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తోసుకోకపోవడం, భాజపా, ఎంఐఎం పార్టీలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యడం వల్లనే.. ఓటు వేసేందుకు గ్రేటర్​ వాసులు చొరవ చూపలేదని అంచనా వేస్తున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేలా ఉందని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజాసమస్యలపై గట్టిగా పోరాటం..

తెరాస, భాజపా, ఎంఐఎం పట్ల నగర ఓటర్లలో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్న భావన ఓటర్లలో ఉన్నందున తమ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని ఓ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. తెరాస విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, డబ్బులు పంపిణీ, బహుమతులు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 20కి మించి డివిజన్లకు ప్రాతినిధ్యం వహించే అవకాశం తమకు వస్తుందని.. ప్రజాసమస్యలపై గట్టిగా పోరాటం చేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

15 మంది గెలిచినా..

ఒక్క మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గ పరిధిలోని 45 డివిజన్లకు 23 చోట్ల గట్టి పోటీ ఇచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలో 15 మంది గెలిచినా.. మరో 10 డివిజన్లు హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి విజయం సాధిస్తామని భావిస్తున్నారు. ఈ నెల నాలుగున వెలువడే ఫలితాలు కాంగ్రెస్ అంచనాలకు తగినట్లు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

‘సిట్‌’ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details