తెలంగాణ పీసీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. అట్టహాసంగా సాగుతున్న కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చేసిన నినాదాలకు రేవంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ అంటూ వ్యక్తిగత నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు చేయాలి తప్ప.. ఇతర వ్యక్తిగత నినాదాలు చేయకూడదని స్పష్టం చేశారు. ఇక నుంచి అలా ఎవరైనా చేస్తే పార్టీ నుంచి బయటకు పంపుతా అని హెచ్చరించారు.
"ఇంకోసారి ఎవరైనా అన్నారంటే పార్టీలో నుంచి బహిష్కరిస్తా. బాధ్యత ఉంటే ఈ రోజు నుంచి జై సోనియా, జై కాంగ్రెస్ అని తప్ప మరే ఇతర వ్యక్తిగత నినాదాలు రాకూడదు. ఇలాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపుతా. కాంగ్రెస్ పార్టీ సమష్టి నిర్ణయాలతో, సమష్టి పోరాటాలతో సమష్టిగా అధికారం చేజిక్కించుకోవాలి. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కాబట్టి యువ మిత్రులు.. మీ గుండెల నిండా ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు.. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం. నన్ను అభిమానించే వారికి విజ్ఞప్తి. అభిమానించే వారు వ్యక్తిగతంగా నినాదాలు ఇవ్వొద్దని ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు