గుంటూరు నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం విజయవాడకు మారబోతోంది. రేపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా విజయవాడ సీతారాంపురంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇది భాజపా నాలుగో రాష్ట్ర కార్యాలయం. మొదట విజయవాడ సూర్యారావుపేట ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక.. అక్కడి నుంచి మరో భవనంలోకి మార్చి, కార్యకలాపాలు నిర్వహించారు. కన్నా స్వస్థలం గుంటూరు కావడంతో.. తరచూ ఇక్కడకు వచ్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతోందనే భావనతో- అక్కడ్నుంచి కార్యాలయం ఖాళీ చేసి.. గుంటూరులోనే భాజపా రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. భారీ సభలు, సమావేశాలు, సమీక్షల కోసం కన్నా విజయవాడ వచ్చి పాల్గొని వెళ్లేవారు.
తాజాగా సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక.. మరోసారి భాజపా కార్యాలయం మార్పు తప్పలేదు. సీతారాంపురంలోని ఓ భవనాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం అద్దెకు తీసుకున్నారు. అక్కడ పార్టీ కార్యాకలాపాల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా రేపు ఉదయం ఏడు గంటలకు ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. పార్టీ రాష్ట్ర రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు కార్యాలయం ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయ ప్రారంభం అనంతరం రాష్ట్ర ముఖ్య నాయకులతో కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణపై చర్చించి, సూచలను చేస్తారని నేతలు తెలిపారు.