ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో క్షణ క్షణం భయం భయం - ఆదిలాబాద్‌ జిల్లా వార్తలు

ఆదిలాబాద్‌ జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు పులి భయంతో భయాందోళనకు గురవుతున్నారు. మహరాష్ట్ర అభయారణ్యం నుంచి తరచూ పులులు వస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. గత మూడేళ్లుగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొలాలకు వెళ్లేందుకు సైతం జంకుతున్నారు.

tiger fear to Telangana border villages
తెలంగాణ: క్షణక్షణం భయం భయం... రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు పులి గిలి

By

Published : Dec 18, 2020, 3:08 PM IST

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని గొల్లఘాట్‌... రాష్ట్ర సరిహద్దు గ్రామం. మహారాష్ట్ర, తెలంగాణను విడదీసే పెన్‌గంగా నది ఈ గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తోంది. నదికి అవతల కనిపిస్తున్నదే మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యం. తరచూ అటు వైపు నుంచి నది దాటి పులులు రాకపోకలు సాగించడం సర్వసాధారణమైపోయింది. నదికి ఆనుకుని ఉన్న సరిహద్దు గ్రామాలైన గుబిడి, కరంజి-టి, గోముత్రి, అంతర్గాం, అర్లి-టి, వడూర్‌, తాంసి-కె, గొల్లఘాట్‌, పిప్పల్‌కోటి గ్రామస్థులు పులి సంచారంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోంది. గత రెండు రోజుల వ్యవధిలో పులి పంజాకు లేగదూడ, ఆవు బలవడం పరిసర గ్రామస్థులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. పత్తి చేనులో పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలను... పులి దాడి ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పులి సంచారంతో తాము పంటచేలకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి భయంతో కూలీలు రాక చేతికొచ్చిన పంటను ఇంటికి తీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. కొందరు తమ పిల్లలను కాపలా పెట్టి చేలలో పనులు చేసుకుంటున్నారు.

పులి కదలికలు ఉండే సరిహద్దు గ్రామాలకు వెళ్లే ఉద్యోగులు సైతం భయంతోనే విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యం సరిహద్దు గ్రామాలకు కూతవేటు దూరంలో ఉండటం.. పులుల సంఖ్య ఏటేటా పెరగడం వల్ల అవి ఆవాసం కోసం ఇటువైపు వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. దాడులు జరిగినపుడు పులి కదలికలు పసిగట్టేందుకు కెమెరాలు బిగిస్తూ పరిసర ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి దాడిలో ఇద్దరు బలైన ఘటన మరవకముందే... ఆదిలాబాద్‌ జిల్లాలో పులి వరుస దాడుల్లో పశువులు హతమవడం పరిసర గ్రామాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది.

ఇదీ చూడండి:

కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

ABOUT THE AUTHOR

...view details