ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు ! - ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీల పెంపు

ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు పడింది. పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ సర్వీసులపై కిలోమీటరుకు పది పైసలు, ఇతర సర్వీసులపై 20పైసల చొప్పన ఛార్జీలు పెంచేందుకు  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సగటున ప్రతి వంద కిలోమీటర్లకు అదనంగా మరో 20 రూపాయల భారం ప్రయాణికులపై పడనుంది. 2-3 రోజుల్లో పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు !
ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు !

By

Published : Dec 8, 2019, 5:33 AM IST

ఆర్టీసీ సర్వీసుల ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ సర్వీసులైన పల్లెవెలుగు, ఆర్డినరీలపై కిలోమీటరుకు పది పైసలు ఇతర సర్వీసులపై 20 పైసల చొప్పున పెరగనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీకి 6వేల 735 కోట్ల రూపాయల అప్పు ఉందని.. దీనితో పాటు ప్రతి నెలా 100 కోట్ల చొప్పున నష్టాలు పేరుకుపోతున్నాయని..రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ నష్టాల నుంచి సంస్థకు కాస్త ఉపశమనం కలిగించేందుకే ఛార్జీలు పెంచుతున్నట్లు వివరించారు. డీజిల్‌ ధరలు గణనీయంగా పెరిగుతున్నా... 2015 నుంచి ఛార్జీలు పెంచలేదని ఇప్పుడు పెంచడం సహేతుకమేనని పేర్ని నాని స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుతో దూరప్రాంతాలకు వెళ్లేవారిపై కనీసం 50 నుంచి 100 రూపాయల మేర అదనపు భారం పడే అవకాశముంది. సిటీ బస్సులపై కిలోమీటరుకు 78 పైసలు ఉన్న ఛార్జీ 88పైసలకు.. పల్లెవెలుగు బస్సుల్లో 63 పైసల నుంచి 73 పైసలకు..ఎక్స్‌ప్రెసుల్లో 87 పైసల నుంచి 1.07 రూపాయలకు..సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 1.16 రూపాయల నుంచి 1.36 రూపాయలకు ఇంద్ర బస్సుల్లో 1.45 రూపాయల నుంచి 1.65 రూపాయలకు......... గరుడ సర్వీసుల్లో 1.71 రూపాయల నుంచి 1.91 రూపాయలకు... అమరావతి బస్సుల్లో 1.91 రూపాయల నుంచి 2 రూపాయల 11 పైసల వరకూ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చే తేదీని...త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బస్సు రకం ప్రస్తుతం (కి.మీ.కి) పెరిగిన ఛార్జీ (కి.మీ.కి)

సిటీ ఆర్డినరీ రూ. 0.78 రూ. 0.88

పల్లెవెలుగు రూ. 0.63 రూ. 0.73

ఎక్స్‌ప్రెస్‌ రూ. 0.87 రూ. 1.07

సూపర్‌ లగ్జరీ రూ. 1.16 రూ. 1.36

ఇంద్ర రూ. 1.45 రూ. 1.65

గరుడ రూ. 1.71 రూ. 1.91

అమరావతి రూ. 1.91 రూ. 2.11


ప్రత్యేక నియంత్రణా మండలి

మరోవైపు... భవిష్యత్తులో RTC ఛార్జీల పెంపు తరహా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రత్యేక నియంత్రణా మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్‌ నియంత్రణా మండలి తరహాలోనే దీన్ని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. తదనుగుణంగా రేపట్నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఛార్జీల పెంపు వంటి విషయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నడుపుతున్న సొంత, అద్దె బస్సుల నిర్వహణలో భారాన్ని బదలాయించేందుకు వీలుగా...ఎప్పటికప్పుడు లాభనష్టాలపై సమతూకంగా వ్యవహరించేందుకు ఈ మండలి సిఫారసుల మేరకు నడుచుకోవాలని RTC భావిస్తోంది. ఈ ప్రత్యేక మండలి ప్రతిపాదన బిల్లుతో పాటు RTC విలీన ప్రక్రియకు సంబంధించిన అంశంపైనా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు !
ఇదీచదవండి

'సీఎం జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి'

ABOUT THE AUTHOR

...view details