అంతర్వేదిలో రథం దహనం సంగతి తేలనే లేదు... మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆ దుర్ఘటన దృష్ట్యా చేపట్టిన ముందస్తు చర్యలు... విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి రథం సింహాలు మాయమైనట్టు బహిర్గతమైంది. అమ్మవారి రథంలోని సింహాల అదృశ్యంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు రోజుల్లో వాస్తవాలు బహిరంగపరచాలని రాజకీయపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తుంటే... ఇది ముమ్మాటికీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనిగా ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది.
ముసుగేసే ఉంచారు
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు, వెనక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం కలకలం రేపింది. గతేడాది ఉగాది రోజున స్వామివార్ల ఉత్సవమూర్తులను ఈ వెండి రథంపై ఊరేగించారు. ఈ ఏడాది కొవిడ్ దృష్ట్యా దేవస్థానం ఊరేగింపు రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగేసి ఉంచారు. అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులతో ఈనెల 13న పశ్చిమ ఏసీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు.
ఎక్కడ ఉన్నాయి?
అప్పుడే రథంపై సింహాల ప్రతిమల్లో మూడు ఆదృశ్యమైన సంగతి వెలుగు చూసింది. మంగళవారం సాయంత్రం నుంచి ఈ సంఘటనపై మీడియాలో కథనాలు రావడం మొదలైంది. ఇదే అంశంపై అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేశ్‌బాబు మీడియాకు వివరణ ఇచ్చారు. గత 18 నెలలుగా వెండి రథం మల్లికార్జున మహామండపంలోనే ఉందని... ఎన్ని సింహాలు ఉన్నాయో? వాటిని మరమ్మతులకు ఇచ్చారా? లాకరులో ఉన్నాయా? అనేది పరిశీలిస్తామన్నారు. అప్పుడుగాని స్పష్టత రాదని తెలిపారు. దేవస్థానంలోని వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు బీమా సౌకర్యం ఉందని... పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు.
శాఖాపరమైన విచారణ
ఉత్సవ రథంపై ఉండే సింహాలు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆలయాన్ని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. దేవదాయశాఖ కమిషనర్ అర్జునరావు, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ అధికారులతో కలిసి రథాన్ని పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రథాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే కనకదుర్గమ్మ వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని తేలిందని వివరించారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రథాన్ని ఉపయోగించడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేటతెల్లమవుతుందని అభిప్రాయపడ్డారు. ఘటనపై దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని... కమిటీ విచారణ చేసి నిజాలు నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని... సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆలయాల ఘటనల విషయంలో 50 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు.
భాజపా నేతల పరిశీలన