కొవిడ్ ఆస్పత్రులు దొంగలకు అడ్డాగా మారాయి. రోగులు చేరే ముందు వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు.. తర్వాత మాయమవుతున్నాయి. విజయవాడలోని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రిలో కరోనాతో చనిపోతున్న వారి శరీరంపై ఉండే ఆభరణాలు, వస్తువులు మాయమవుతున్నాయనే ఆరోపణలు గత మూడు నాలుగు నెలలుగా ఎక్కువయ్యాయి. బాధితులు ఇదే విషయంపై అడిగితే సమాధానం చెప్పేవాళ్లు ఉండటం లేదు. మాకు తెలియదంటే.. తెలియదంటూ సిబ్బంది తప్పించుకుంటున్నారు. అసలే కరోనా రోగులుండే ఆసుపత్రి కావడంతో బంధువులు అక్కడ ఎక్కువ సమయం ఉండలేక .. ఎవరితో చెప్పుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు .
వాచ్, కళ్లద్దాలు ఉఫ్..
విజయవాడ మధురానగర్‌కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతను ఆసుపత్రిలో చేరేటప్పుడు ఖరీదైన కళ్లద్దాలు, చేతి గడియారం ఉండేవి. చనిపోయిన తర్వాత ఆ రెండింటిని ఎవరు తీసుకున్నారో తెలియదు. తర్వాత .. మృతుడి భార్య ఈ విషయం అడిగినా కనీసం ఆసుపత్రిలో సమాధానం చెప్పేవాళ్లు లేరు .
బంగారు గాజు.. రోల్డ్ గోల్డ్‌గా మారింది
కృష్ణలంకకు చెందిన హేమలత కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన తల్లిని ఆగస్టు 27వ తేదీన విజయవాడ ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆమెకు చెవి కమ్మలు, బంగారు గాజులు ఉన్నాయి. వాటిని తీసి ఇచ్చేయమంటూ అడగడంతో చెవి కమ్మలు, చేతికున్న నాలుగు గాజుల్లో మూడింటిని తెచ్చి బంధువులకు ఇచ్చారు. నాలుగో గాజు గురించి అడిగితే .. రోగి చెయ్యి వాసిందని , తీస్తుంటే నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో తీయలేదని చెప్పారు. మూడు రోజుల తర్వాత ఆమె చనిపోయింది. మృతురాలి చేతికి ఉన్న బంగారు గాజు స్థానంలో రోల్డ్ గోల్డ్ గాజు పెట్టి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఎంతసేపు అడిగినా.. తమకు తెలియదని, కావాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని ఉచిత సలహాలు ఇచ్చారు
ఇలా ఇప్పటికే చాలామందికి సంబంధించిన సెల్ఫోన్లు, ఇతర వస్తువులు, జేబులో ఉండే డబ్బులు సైతం పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రిలో అన్నిచోట్ల సీసీ కెమెరాలున్నాయి.. ఎవరు కాజేస్తున్నారు.. ఎక్కడ కాజేస్తున్నారనేది గుర్తించడం పెద్ద కష్టం కాదు. కానీ.. బాధితులు ఫిర్యాదు చేస్తే వెళ్లి పోలీసులకు చెప్పండంటూ చెప్పి సిబ్బంది చేతులు దులిపేసుకుంటున్నారు. చాలామంది బాధితులు ఈ విషయాన్ని అక్కడితో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కేంద్రం కౌంటర్